
- ప్రధాని మోదీ డైరెక్షన్లో పనిచేస్తున్నరు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి ఆరెస్సెస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారని విమర్శించారు. మోదీ, రేవంత్భేటీతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దోస్తీ బట్టబయలైందన్నారు. గురువారం ఆమె తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్‌ను బీజేపీ నాయకులే కాపాడుతున్నారని తెలిపారు. సంబంధం లేని విషయాలను సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్కు అంటగడుతున్నారని మండిపడ్డారు.
తమ కుటుంబ సభ్యులెవరూ, ఎప్పుడూ ప్రొటొకాల్ ను ఉల్లంఘించలేదని, కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్ చార్జి అని సీఎం చెప్పుకున్నారని, పార్టీ పరంగా ఇన్ చార్జి అయితే తమకు ఇబ్బంది లేదని, కానీ తిరుపతి రెడ్డి అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు. తమ కుటుంబంలోని ప్రజాప్రతినిధులు అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి ప్రజాసేవ చేస్తున్నామన్నారు. గుమ్మడి నర్సయ్య వంటి మహోన్నతమైన వ్యక్తిని గేటు బయట నిలబెట్టి రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారని, అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి అని వివరించారు.
8 మంది ప్రాణాలను పట్టించుకుంటలే..
సీఎం సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ప్రమాదం జరిగి.. 8 మంది చిక్కుకున్నా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లారని కవిత విమర్శించారు. ఉత్తరాఖాండ్ లో టన్నెల్ లో కార్మికులు చిక్కుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి వాళ్లు ప్రాణాలతో బయటపడేవరకు అక్కడే ఉన్నారని గుర్తుచేశారు. కానీ, సీఎం రేవంత్‌కి దేనిమీదా సోయిలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయన్నారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటికీ అతీగతీ లేదని, ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోతే ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. మేఘా కృష్ణా రెడ్డి కడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లావద్దన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ముఖ్యమా... కాంట్రాక్టర్లు ముఖ్యమా ? అని కవిత నిలదీశారు.