గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సమర్థించుకున్నారు. తన మాటల్లో తప్పేం లేదని..అది తెలంగాణ యాస అని అన్నారు. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఎవరికీ భయపడనని.. తాను సీఎం కేసీఆర్ శిష్యుణ్ణి అని చెప్పారు. గవర్నర్ ను చిన్న మాట అంటేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉలిక్కిపడ్డారని.. సీఎం పోస్ట్ రాజ్యాంగ బద్ధమైన పదవి కాదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పై ప్రతిపక్షాలు మాట్లాడితే తప్పు లేదు కానీ తాము మాట్లాడితే తప్పా అని ఎదురు ప్రశ్నించారు. అసెంబ్లీలో పాసైన బిల్లులను ఆపితే తమ కడుపు మండదా అని వ్యాఖ్యానించారు. గవర్నర్.. గవర్నర్ గా ఉంటే తమకు అభ్యంతరం లేదు కానీ.. ఢిల్లీ డైరెక్షన్ లో నడిస్తే మాత్రం సహించబోమని చెప్పారు. గవర్నర్ కార్యాలయాన్ని బీజేపీ కార్యాలయంగా మార్చుకుంటే బాగుంటుందని విమర్శించారు.
హుజురాబాద్ లో నేనే పోటీ చేస్తా
వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ నిన్న సభలో కూడా ఇదే విషయం చెప్పారని.. తాను కేసీఆర్ శిష్యునిగా పోటీ చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే ఈటెల కేసీఆర్ కి సున్నం పెట్టినట్లే.. హుజురాబాద్ ప్రజలకు కూడా పెట్టారని విమర్శించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కూడా మంత్రితో ఓపెన్ చేస్తామని..ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు.