మొయినాబాద్ పీఎస్‎కు BRS ఎమ్మెల్సీ పోచంపల్లి.. ఏమైందంటే..?

మొయినాబాద్ పీఎస్‎కు BRS ఎమ్మెల్సీ పోచంపల్లి.. ఏమైందంటే..?

హైదరాబాద్: కోళ్ల పందెం కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు శుక్రవారం (మార్చి 14) ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్‎కు వచ్చారు. ఫామ్ హౌస్‏లో కోళ్ల పందెలు, క్యాసినో వ్యవహారంపై ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు. 

కాగా, 2025 ఫిబ్రవరి 11న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ ఐ.కిషన్, మొయినాబాద్ సీఐ పవన్ కుమారెడ్డి 50 మంది సిబ్బందితో కలిసి పందేల శిబిరంపై దాడి చేశారు. ఏపీకి చెందిన నిర్వాహకుడు శివకుమార్, పందెం రాయుళ్లను చుట్టుముట్టి మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.

  84 పందెం కోళ్లు, రూ.30 లక్షల క్యాష్, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 64 మందిని మొయినాబాద్ పీఎస్‎కు తరలించారు. అయితే.. కోడి పందెలు నిర్వహించిన ఫామ్ హౌస్‎ను ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి శివకుమార్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆయనపై సెక్షన్- 3& 4 గేమింగ్ యాక్ట్, సెక్షన్ -11 యానిమల్ యాక్ట్ నమోదు కింద కేసు నమోదు చేశారు. 

ALSO READ | నాగార్జున సాగర్‎లో ఎమర్జెన్సీ పంపింగ్.. హైదరాబాదీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఈ కేసులో విచారణకు 2025, ఫిబ్రవరి 13న పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో తన న్యాయవాది ద్వారా పోలీసుల నోటీసులకు రిప్లై పంపించారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి. తాజాగా ఇదే కేసులో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. మార్చి 14న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఆయన మొయినాబాద్ పీఎస్‎కు వెళ్లారు.