* అందించిన బీఆర్ఎస్
* సభను తప్పుదోవ పట్టించారని ఆరోపణ
* స్పీకర్కు అందించిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోరారు. తెలంగాణ శాసనసభ కార్య విధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం ఈ నోటీసు ఇచ్చినట్టు బీఆర్ఎస్ ఎల్పీ తెలిపింది. తెలంగాణ అప్పులపై ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించారని నోటీసులో పేర్కొంది. ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్ కు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.
ఆర్‌బీఐ నివేదికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని స్పష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభాహక్కులు నోటీలు ఇస్తున్నామని వివరించింది. అప్పులపై ఆర్ధిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని చెప్పింది. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన ''హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్'' నివేదిక దీనికి అద్దం పడుతుందని పేర్కొంది.
2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ. 3,89, 673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించిందని తెలిపింది. ఆర్ధిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొంది.