న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో అమృత్ స్కీంలో జరిగిన అవినీతిపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. ఈ అంశంపై తాము రాజ్యసభలో కేంద్రాన్ని నిలదిద్దామంటే.. సభ సజావుగా జరగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అవినీతిపై ఇప్పటికే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారని గుర్తుచేశారు.
మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి వద్దిరాజు మీడియాతో మాట్లాడారు. అమృత్ స్కీం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఇందులో వందల కోట్ల స్కాం దాగి ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించిన అంశాలపై రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. మరోవైపు మోదీ–అదానీ ఫొటోలతో ఉన్న టీషర్ట్ ధరించి రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అడుగుపెట్టారని, మరి అదానీ–రేవంత్ ఫొటోలతో బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీలోకి వస్తే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ఆయన ప్రశ్నించారు.