- కేంద్రానికి బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు : ఏపీ రీ-ఆర్గనైజేషన్ యాక్ట్‌లో పొందుపరిచిన హామీ మేరకు తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
దాదాపు అర గంట పాటు సాగిన ఈ భేటీలో విభజన చట్టంలోని పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్ర నిబంధనల్లో పొందుపర్చినట్లు తెలంగాణలోని జిల్లాకొక నవోదయ స్కూల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో నవోదయ స్కూళ్లను ప్రారంభించాలని కోరారు. తన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వద్దిరాజు తెలిపారు.