
- బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్, వద్దిరాజు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో భూముల అమ్మకాలు కొత్త కాదని, తమ ప్రభుత్వం కూడా భూములను వేలం వేసిందని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అయితే అప్పుడు పబ్లిక్‌గా చెప్పి ఆ భూములను విక్రయించామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. హెచ్‌సీయూ భూముల్లో రాష్ట్ర సర్కార్ విధ్వంసానికి పాల్పడిందన్నారు. విద్యార్థులు చేసిన పోరాటానికి ఫలితమే సుప్రీంకోర్టు ఆదేశాలని పేర్కొన్నారు.
శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. హెచ్‌సీయూ వర్సిటీకి చెందిన 400 ఎకరాల్లో పార్క్‌ను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించకుండా ఆ భూములను రియల్ మాఫియాకు కట్టబెట్టాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. అయితే, ఆ భూముల విషయంలో ప్రభుత్వ నిజ స్వరూపం బయటపెట్టామని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిపోయిందని విమర్శించారు. హైడ్రా పేరుతో దోచుకోవడానికి, బెదిరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అది హైడ్రా కాదు.. కోబ్రా అని, ఒక కాటు వేస్తే అంతే అంటూ విమర్శించారు. పార్లమెంట్‌లో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు- వేశామని వెల్లడించారు.