
కౌడిపల్లి, వెలుగు: మీ ఆడపడుచుగా భావించి ఈసారి ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి మండలంలోని తునికి, హరిచంద్ తండా, ముట్రాజ్ పల్లి, రాజిపేట్, వెంకటాపూర్, వెంకట్రావుపేట్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల లావాణి భూములకు ప్రభుత్వం వచ్చాక పట్టాలు ఇస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ కవిత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్, వైస్ ఎంపీపీ నవీన్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు రామా గౌడ్ పాల్గొన్నారు.
గిరిజనుల నిరసన
తునికి హరిచంద్ తండాలో సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతుండగా.. ఆరు నెలల నుంచి భగీరథ నీళ్లు రావడంలేదని, అయినా ఎవరూ పట్టించుకునేవారు లేరని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తండా నుంచి జడ్పీటీసీ మెంబర్ ఉన్నా ఉపయోగం లేదన్నారు. సర్పంచ్ తమను పట్టించుకోవడమే మానేశాడన్నారు. తమ తండాను చిన్నచూపు చూస్తున్నారని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు ఎట్లా అడుగుతారని మండిపడ్డారు. మా సమస్యలు పరిష్కరించిన వారికే మా ఓట్లు వేస్తామన్నారు. ఐదేళ్లలో తండా మొహం చూసిన నాయకుడు లేడు కానీ ఓట్ల సమయం రాగానే మైకులు పట్టుకుని వస్తున్నారని మండి పడ్డారు.