పార్టీలో ఉందామా? .. దారి చూసుకుందామా?

  • సమాలోచనలు చేస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
  • కిందిస్థాయి లీడర్లలోనూ అదే ఆలోచన 
  • వచ్చే ఏడాది ఆరంభంలో ఉండే లోకల్​ బాడీస్​ ఎన్నికల చుట్టూ పాలిటిక్స్​

కామారెడ్డి, వెలుగు: పదేండ్ల పాటు స్టేట్​లో బీఆర్ఎస్​కు ఎదురు లేదు. అసెంబ్లీ నుంచి స్థానిక సంస్థల వరకు మెజార్టీ సభ్యులు ఆ పార్టీ ప్రజాప్రతినిధులే. ప్రతిపక్షాల నుంచి గెలిచిన వారిలో అనేక మంది ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గులాబీ గూటికి చేరారు. వారిలో కొందరు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో తిరిగి తమ సొంత గూటికి చేరుకోగా, మరికొందరు అందులోనే కొనసాగుతున్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి కాంగ్రెస్​పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ఈ నేపథ్యంలో అనేక మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి లీడర్లు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, లోకల్ లీడర్లు ఇప్పటికే ఈ విషయామై సమాలోచనలు చేస్తున్నారు. అధికార పార్టీలో ఉంటే తమ పనులు చేసుకోవచ్చని, ఆఫీసర్లు కూడా వినే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఈ ఉద్ధేశంతోనే ప్రతిపక్ష పార్టీల తరఫున గెలిచిన వారిలో మెజార్టీ సభ్యులు అధికార పార్టీకి మారారు.

మారుతున్న సమీకరణలు..

మొన్నటి వరకు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు చెప్పిందే వేదం అన్న పరిస్థితి ఉండేది. దీంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచిన అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీల చైర్మన్లు, కౌన్సిలర్లు గులాబీ కండువా కప్పుకున్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల కాంగ్రెస్, ఒక్కోచోట బీజేపీ, బీఆర్ఎస్​ గెలిచాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గతంలో బీఆర్ఎస్​లో చేరిన వారిలో అనేక మంది తిరిగి కాంగ్రెస్​గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో గతంలో కాంగ్రెస్​నుంచి గెలిచి బీఆర్ఎస్​లోకి వెళ్లిన వారిలో మెజార్టీ లీడర్లు తిరిగి సొంత గూటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారు.

ఇక్కడి నుంచి కేసీఆర్​ పోటీ చేయనున్నారనే ప్రకటనతో ఆగిపోయారు. ఎన్నికల టైమ్ లో మాత్రం నలుగురు కౌన్సిలర్లు పార్టీ మారారు. ప్రస్తుతం మరికొంత మంది కౌన్సిలర్లు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్​ తరఫున గెలిచిన లోకల్​ బాడీస్​ప్రతినిధులు బీఆర్ఎస్​లో చేరారు. ఇటీవల ఎల్లారెడ్డి ఎంపీపీ, లింగంపేట జడ్పీటీసీతో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు తిరిగి కాంగ్రెస్​ గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్​ నుంచి గెలిచిన వారు సైతం కాంగ్రెస్​  కండువా కప్పుకున్నారు. 

త్వరలో లోకల్​ బాడీస్​ ఎన్నికల దృష్ట్యా..

వచ్చే ఏడాది ఆరంభంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత అగ్రికల్చర్​ సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ మారేందుకు లీడర్లు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్తే అయిదేండ్ల పాటు ఢోకా ఉండదని భావిస్తున్నారు.

బిల్లులు పెండింగ్​లో ఉండడం, స్థానికంగా పనులు కావాలంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే పార్టీ మారితేనే బాగుంటుందని యోచిస్తున్నారు. కొందరు కౌన్సిలర్లు ఇప్పటికే కాంగ్రెస్​పార్టీ స్థానిక లీడర్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తమకు పోటీకి అవకాశం ఇస్తామంటే వచ్చేందుకు సిద్ధమని టౌన్​తో పాటు, ఆయా గ్రామాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చెబుతున్నట్లు తెలుస్తోంది.