కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ పోటీ డౌటే!..

 కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ పోటీ డౌటే!..
  • స్వతంత్రులకే మద్దతిచ్చే చాన్స్
  • కోట్లు కుమ్మరించినా ‘నల్లగొండ’లో గెలువలే
  •  ఇండిపెండెంట్లకు మద్దతివ్వడమే బెస్ట్..?
  •  కారు పార్టీ లీడర్ల అంతర్మథనం

హైదరాబాద్: త్వరలో జరగబోయే కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. వరుస పరాభవాలతో పరేషాన్ లో ఉన్న గులాబీ పార్టీ  ఈ సారికి ఎవరైనా ఇండిపెండెంట్ కు మద్దతు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన సమయంలో వెన్నంటి ఉన్న జిల్లాలను ఈ సారి విస్మరిస్తుండటం గమనార్హం. ఇటీవల జరిగిన నల్లగొండ–ఖమ్మం –వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగి ఏనుగుల రాకేశ్  రెడ్డిని బరిలోకి దించింది. ఈ సందర్భంగా భారీగా డబ్బులు ఖర్చు చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న బరిలోకి దిగారు. తీన్మార్ మల్లన్నపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేయించారు. అయినా తీన్మార్ మల్లన్నకే ఓటర్లు పట్టం కట్టారు. 

ALSO READ : ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్ను అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు

ఇదిలా ఉండగా గతంలో జరిగిన కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గ్రూప్ –1 ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ను బీఆర్ఎస్ రంగంలోకి దించింది. కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రశ్నించే గొంతుక నినాదంతో బరిలోకి దిగిన జీవన్ రెడ్డినే గెలిపించారు. ఈ అనుభవాలన్నీ లెక్కలు వేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎవరనే చర్చకూడా సాగడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినందున ఇక్కడ పోటీ చేయకుండా ఉంటే బాగుండదనే మరో చర్చకూడా నడుస్తోందని సమాచారం. ఏది ఏమైనా స్వతంత్రులకే మద్దతిచ్చేందుకే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.