కవిత దీక్ష ఓ ఎత్తుగడ : కరుణ గోపాల్

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష చేయడం విడ్డూరం. మహిళల గౌరవం కోసం ఆందోళన చేస్తున్న ఆమెకు అద్దం చూపించాల్సిన సమయం వచ్చింది. టీఆర్ఎస్​అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేండ్లపాటు ఆమె తండ్రి ప్రభుత్వంలోని మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి లేరు. ఆ తర్వాతి టర్మ్​లో ఇద్దరికి ఇచ్చారు. తెలంగాణలో మహిళలపై జరిగిన, జరుగుతున్న దాడులు, నేరాలను ఆమె ఎప్పుడూ ఖండించలేదు. సొంత పార్టీలో మహిళలకు జరుగుతున్న అన్యాయం, హక్కులను కాలరాస్తున్నప్పుడు కూడా కవిత ఎన్నడూ స్పందించలేదు. తెలంగాణ ప్రథమ పౌరురాలు, ఒక మహిళ అయిన గవర్నర్ డాక్టర్ తమిళిసైని ఆమె పార్టీ నాయకులు బహిరంగంగా దూషించిన, అనుచిత కామెంట్లు చేసినా కవిత మౌనం వీడలేదు. ఆ ఘటనపై సదరు నాయకుడు ప్రజల ఆగ్రహానికి గురైనప్పటికీ, సీఎం మంచి పదవిని బహుమతిగా ఇచ్చారు. నిజానికి గౌరవనీయులైన గవర్నర్‌ను ఆమె తండ్రి సీఎం చాలాసార్లు బహిరంగంగా అవమానించారు. ఇవ్వాల్సిన ప్రొటోకాల్​ఇవ్వలేదు. బీఆర్ఎస్ కు మహిళలంటే గౌరవం లేదని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఢిల్లీలో మహిళల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న కవిత.. దాతృత్వం ఇంట్లోనే మొదలవుతుందని ఆమెకు తెలియదా?

మహిళలపై నేరాలు తెలంగాణలోనే ఎక్కువ..

ఆమె అన్న మంత్రి కేటీఆర్ తోటి మంత్రులకు ట్విటర్‌లో సూచనలిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఐఐఐటీలో ఓ మహిళా మంత్రికి బహిరంగంగా జరిగిన అవమానం ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. నగరంలో వీధి దీపాలు లేవు. మహిళా రిజర్వేషన్లపై ఆందోళన చేయడానికి ఢిల్లీకి వచ్చిన బీఆర్ఎస్​ నాయకులకు ఇవీ ఏమీ కనిపించవా? ఇలాంటి నాయకులు తమ పాలనా వైఫల్యాన్ని చాలా సులువుగా కొట్టిపారేస్తుంటారు. దేశంలోనే ‘అత్యధిక మైనర్ రేప్’ లు తెలంగాణలో నమోదయ్యాయి. రాష్ట్రంలో మహిళలపై దాడులు, నేరాలు ఇటీవలి కాలంలో 23 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి.

మొదలు మీ మిత్రులను ఒప్పించు 

ముస్లింల ప్రయోజనాలకు సంబంధించింది కాదని మహిళా రిజర్వేషన్​బిల్లును వ్యతిరేకించిన.. మీ మిత్ర పక్షం ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీని మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని అడిగారా? పార్లమెంట్​లో బిల్లు వీగిపోవడానికి కారణమైన సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన పితామహులతో మీ తండ్రి సీఎం కేసీఆర్ భాగస్వామ్యం కోసం వెళ్లారు. బిల్లుపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు అసహ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేసిన వాళ్లను కవిత మద్దతు అడుగుతుందా? ముందు అఖిలేష్ యాదవ్‌ని రంగంలోకి దించండి! బిల్లుపై తన వ్యతిరేకతను విరమించుకోమని చెప్పండి. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ ప్రతిపాదించిన సంగతి కవితకు తెలుసు. ఏండ్ల తరబడి మహిళా సాధికారత కోసం బీజేపీ కృషి చేస్తున్నది.  ప్రస్తుత మంత్రి మండలిలో పదకొండు మంది మంత్రుల నుంచి మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్ వరకు., నవ భారతాన్ని అధికారంలోకి తీసుకురావడానికి నారీ శక్తిపై మోడీ ప్రభుత్వానికి ఉన్న విశ్వాసం అందరికీ తెలిసిందే.  మహిళా రిజర్వేషన్ ​బిల్లు పట్ల తన నిబద్ధతను నిరూపించుకోవడానికి మహిళా పోటీదారులకు 33% సీట్లు రిజర్వ్ చేయమని కవిత మొదట తన తండ్రిని ఒప్పించాలి. జంతర్ మంతర్ లో ఈ నిరసన ప్రదర్శన ఒక ఎత్తుగడ! ఇది ఒక వ్యూహం. ఆమె మద్యం కుంభకోణంలో అరెస్టు అయితే.. మహిళా రిజర్వేషన్​ కోసం పోరాడుతుంటే అరెస్ట్​చేశారన్న సంకేతం ఇవ్వాలన్నదే ఆమె లక్ష్యం.

- కరుణ గోపాల్, బీజేపీ నేషనల్ ​ఇన్​చార్జి, ఉమెన్​ పాలసీ వింగ్