ఇక్కడ ఇన్​.. అక్కడ ఔట్​! .. పెద్దపల్లిలో చేజారుతున్న బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాడర్​

  • సిరిసిల్లలో బీఆర్​ఎస్​లో చేరికల జోరు
  •  బీజేపీ నుంచి పెద్దసంఖ్యలో వలసలు 
  • ఎమ్మెల్యే దాసరి తీరుతో కాంగ్రెస్​లోకి క్యూకడ్తున్న నేతలు
  •  క్యాడర్​ చేజారుతుండడంతో బుజ్జగింపు ప్రయత్నాల్లో ఎమ్మెల్యే మనోహర్​రెడ్డి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్​ ఆకర్ష్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్​ సొంత ఇలాకా కావడంతో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి లీడర్లను చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన లీడర్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి అధికార బీఆర్​ఎస్​లో చేరుతున్నారు. మొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి రమాకాంత్ రావు, మూడు రోజుల కింద ఓయూ జేఏసీ నేత దరువు ఎల్లన్న, తాజాగా బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి అన్నల్థాస్ వేణు పార్టీకి రిజైన్ చేసి సోమవారం కార్యకర్తలతో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈక్రమంలో అధికార పార్టీ నేతలు నియోజకవర్గంలో వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న లీడర్లను గుర్తించి వారి ఇండ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.  

నారాజ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ లీడర్లు

సిరిసిల్లలో అత్యధిక జనాభా ఉన్న పద్మశాలీ సామాజిక వర్గానికి బీజేపీ టికెట్ కేటాయించలేదు. ఇదే వర్గానికి లగిశెట్టి శ్రీనివాస్  కొన్ని నెలల కింద బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఆ టైంలో బండి సంజయ్​ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని శ్రీనివాస్​కు హామీ ఇచ్చారు. సిరిసిల్ల టికెట్‌‌‌‌‌‌‌‌ కోసం 22 మంది దరఖాస్తు చేసుకోగా రాణిరుద్రమను క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా పార్టీ హైకమాండ్​ డిక్లేర్​ చేసింది.

దీంతో ఆయనతోపాటు స్థానిక లీడర్లు నారాజ్​గా ఉన్నారు. స్థానికులకే టికెట్ కేటాయించాలని హైకమాండ్‌‌‌‌‌‌‌‌కు విన్నవించారు. అయినా స్పందన లేకపోవడంతో కమలం పార్టీని వీడుతున్నారు. దరువు ఎల్లన్న, మాజీ ఎమ్యెల్యే కటుకం మృత్యుంజయం, ఆవునూరి రమాకాంత్ రావు ఇప్పటికే పార్టీని వీడారు. ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అన్నల్థాస్ వేణు, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు సురువు వెంకట్, బీజేవైఎం జిల్లా ప్రదాన కార్యదర్శి బూర విష్ణు, బీజేవైఎం  సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ మల్లడపేట భాస్కర్, దళిత లీడర్​ కంసాల మల్లేశం కార్యకర్తలతో కలిసి బీజేపీకి రిజైన్ చేశారు. సోమవారం సాయంత్రం ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్ ​సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొద్ది రోజుల కింద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్​ మాజీ చైర్మన్​ ఎలువాక రాజయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్​ లీడర్లు పార్టీని వీడారు. వారం రోజులుగా నియోజకవర్గంలోని చాలా మండలాల నుంచి  సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి నాయకులు సైతం పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు.

రెండు రోజుల కింద కాల్వశ్రీరాంపూర్​ మండలం కునారం గ్రామానికి చెందిన సర్పంచ్​ డొంకెన విజయమొగిలి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు.  మరో రెండు రోజుల్లో కొందరు, సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు పలువురు ముఖ్యమైన లీడర్లు పార్టీని వీడనున్నట్లు సమాచారం. వలస వెళ్తున్న నాయకులంతా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డిని టార్గెట్​ చేస్తున్నారు. ఎమ్మెల్యే నియంతృత్వ ధోరణి తట్టుకోలేకనే, పార్టీ వీడాల్సి వస్తోందని ఆయానాయకులు చెప్తున్నారు.  కాగా బీఆర్ఎస్​నుంచి బయటకు వస్తున్న లీడర్లను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నిస్తోంది. 

బుజ్జగింపులు పనిజేస్తలేవ్..

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో అవమానాలు భరించలేకనే పార్టీలు మారుతున్నామని, వలస లీడర్లు చెబుతున్నారు. 2001 నుంచి పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులు ప్రస్తుతం లేరు. 2014లో ఎమ్మెల్యేగా దాసరి మనోహర్​రెడ్డి బీఆర్ఎస్​ నుంచి గెలిచారు. ఆ టైంలో పెద్దపల్లి మున్సిపల్​ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఎలువాక రాజయ్య ఉన్నారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. దీంతో  2019లో జరిగిన మున్సిపల్​ ఎన్నికల్లో ఎలువాక రాజయ్యకు కౌన్సిలర్​ టికెట్​ రాకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి.

మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాసరి మనోహర్​రెడ్డికి అనుకూలంగా మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు పనిచేశారు. అనంతరం దాసరి.. బిరుదును కూడా పక్కన పెట్టారన్న చర్చ నడిచింది. దాసరి రెండుసార్లు గెలవగా..  మొదటి టర్మ్​లో ఉన్న లీడర్లు.. రెండో టర్మ్​లో దూరమయ్యారు. ఇప్పుడు వారు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి, సుల్తానాబాద్​ మండలాల నుంచి  బీఆర్​ఎస్​ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులందరినీ దాసరి పక్కన పెడుతూ వచ్చారని, ఉద్యమకారులు ఇప్పటికే ఎమ్మెల్యేకు దూరమయ్యారన్న ప్రచారం నడుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు రావడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి బాధితులుగా చెప్పుకునే వారంతా ఏకమయ్యారు. ఈ క్రమంలోనే ఆయనను ఓడించడానికి కాంగ్రెస్​ కరెక్ట్​ అనే భావనతోనే కాంగ్రెస్​ కండువా కప్పుకుంటున్నట్లు పార్టీని వీడుతున్న లీడర్లు చెబుతున్నారు.  కాగా ఎమ్మెల్యే 9 ఏండ్లుగా నాయకులకు, కార్యకర్తలతో అంటీముట్టనట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉండగా.. తాజాగా బుజ్జగిస్తున్నా వినే పరిస్థితిలో క్యాడర్ ​లేదు.