లోక్సభ సమీక్ష సమావేశాల్లోనూ తమ గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నల్గొండ లోక్సభ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు తమ ఆందోళనను వెలిబుచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తమపై కేసులు, రౌడీషీట్లు పెట్టారని గుర్తుచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు కాకుండా వలస వచ్చిన నేతలకు పదవులు ఇచ్చారని తెలిపారు. తమ బాధలు చెప్పుకుందామన్న ఏ ఒక్క అవకాశం రాలేదన్నారు.
కనీసం గ్రామ కమిటీల్లో అవకాశం కల్పించినా పార్టీ కోసం పని చేసేవాళ్లమని వెల్లడించారు. కమిటీలు లేకపోవడంతోనే పార్టీతో ప్రజలకు సంబంధం లేకుండా పోయిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే అవకాశం పోయిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమీక్షా సమావేశాల్లో తమ బాధలు చెప్పుకుందామన్నా విమర్శలు చేయొద్దు అంటూ పలువురు నేతలు ఆంక్షలు పెడుతున్నారని వివరించారు.
పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని, వెంటనే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీ హైకమాండ్ ను కోరారు.