- ఇటీవల ఎమ్మెల్యేలుగా గెలిచిన పల్లా, కడియం, కౌశిక్‌రెడ్డి
- టికెట్‌పై వేం నరేందర్‍రెడ్డి, జంగా రాఘవరెడ్డి, బల్మూరి వెంకట్ ఆశలు
- బీఆర్ఎస్ నుంచి ఇంకా బయటపడని ఆశావహులు
వరంగల్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవులపైనే పడింది. నలుగురు ఎమ్మెల్సీలు అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో ప్రస్తుతం ఆ పోస్టులు ఖాళీ అయ్యాయి. అయితే ఈ నాలుగింటిలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే మూడు స్థానాలు ఉన్నాయి. దీంతో ఆ స్థానాలకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు ఎవరిని ఎంపిక చేస్తాయన్న విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. తిరిగి ఉమ్మడి జిల్లా వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తారా ? లేక కొత్తవారిని తీసుకొస్తారా ? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
ఓరుగల్లు నుంచి పల్లా, కడియం, కౌశిక్‌రెడ్డి
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇందులో మహబూబ్‍నగర్‌కు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి తప్ప మిగతా ముగ్గురు వరంగల్ జిల్లాకు చెందిన వారే. ఇందులో నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ నుంచి గెలువగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కొనసాగిన కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో, పాడి కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్‌లో గెలిచారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు రాజీనామాలు సమర్పించగా, గవర్నర్ కోటాలో ఇప్పటికే మరో రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య ఆరుకు చేరుకుంది.
మళ్లీ ఓరుగల్లుకు ఛాన్స్ దక్కేనా ?
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ పోస్టుల కోసం 10 నుంచి 15 మంది పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తం ఖాళీల్లో సగం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే ఉండడంతో తిరిగి ఈ ప్రాంతం నుంచి ఎంత మందికి అవకాశం ఇస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూడు స్థానాల్లో తమకు అవకాశం దక్కుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది.
అలాగే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డ జంగా రాఘవరెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బరిలోకి దిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టికెట్ కోసం వెంకట్ ప్రయత్నించగా ఒడితల ప్రణవ్‌బాబుకు అవకాశమిచ్చారు.
దీంతో బల్మూరి సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మాత్రమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి ఉన్నారు. దీంతో జనగామ జిల్లా హెడ్‌క్వార్టర్‌లో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ క్రమంలో జనగామ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‍రెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ సీటు
రాష్ట్రంలో ఖాళీ అయ్యే ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో గవర్నర్ కోటాలోని 2 సీట్లలో అధికార కాంగ్రెస్ పార్టీకే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన నాలుగుచోట్ల కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి ఉంది. పల్లా, కసిరెడ్డి స్థానాలు గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా కాబట్టి మళ్లీ ఎలక్షన్లు తప్పవు. కడియం, కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ సీట్లు ఎమ్మెల్యే కోటాకు సంబంధించినవి. అసెంబ్లీలో పార్టీల బలాన్ని బట్టి ఎన్నుకుంటారు. ఈ లెక్కన బీఆర్‌ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ దక్కితే ఎవరిని రంగంలోకి దింపుతారన్న విషయం సందిగ్ధం నెలకొంది. 30 నుంచి 40 ఏండ్లు రాజకీయాల్లో ఉన్నవారు కూడా ఎమ్మెల్యేలుగా ఓటమి చెందిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కోసం ఆశపడేవారు ఎక్కువగానే ఉన్నారు. ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోకపోవడంతో ఆ పార్టీ లీడర్ల పేర్లు బయటకు పొక్కడం లేదు.