- రివ్యూ మీటింగుల్లో బీఆర్ఎస్ పెద్దలకు నేతలు, కార్యకర్తల చురక
- ఇకనైనా అహంకారం తగ్గించుకొని క్యాడర్‌ను పట్టించుకోవాలని సలహా
- అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై సమీక్షించుకోవాలని హితబోధ
- లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని హెచ్చరిక
- బిత్తరపోతున్న లీడర్లు
వెలుగు, నెట్వర్క్: బీఆర్ఎస్ హైకమాండ్ తీరుపై ఇన్నాళ్లూ లోలోపలే రగిలిపోయిన నేతలు, కార్యకర్తలు ఎట్టకేలకు గొంతు విప్పుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న రివ్యూ మీటింగులను వేదికగా చేసుకొని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరును ఎక్కడికక్కడ ఎండగడ్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్‌ను, ఉద్యమకారులను పట్టించుకోకుండా ఒంటెత్తు పోకడలు పోయారని ఫలితంగానే ఓటమిపాలయ్యామని దెప్పిపొడుస్తున్నారు. కనీసం ఇప్పుడైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటో సమీక్షించుకోవాలని, లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. నేతల అహంకారం వల్లే పార్టీకి నష్టం జరిగిందని, ఇకనైనా తగ్గించుకోవాలని హితవు పలుకుతున్నారు. పార్టీ అధికారంలో ఉండగా ఏనాడూ తాము గీచిన గీత దాటని వాళ్లు ఇప్పుడు వివిధ అంశాలపై తమను కడిగిపారేస్తుండడంతో లీడర్లు అవాక్కవుతున్నారు.
లీడర్లపై క్యాడర్ గుస్సా..
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్‌ను సన్నద్ధం చేసేందుకు కొద్దిరోజులుగా నియోజకవర్గాలవారీగా బీఆర్ఎస్ రివ్యూ మీటింగులు నిర్వహిస్తోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్న ఈ మీటింగుల్లో లీడర్ల తీరును సెకండ్ క్యాడర్ లీడర్లు ఎండగడ్తున్నారు. పేర్లు పెట్టి మరీ తప్పులను ఎత్తిచూపుతున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి లీడర్లు సైతం హైకమాండ్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి గులాబీ జెండా మోస్తున్న క్యాడర్‌ను, ఉద్యమకారులను పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అక్కున చేర్చుకోవడం వల్లే ఓటమిపాల య్యామని దెప్పిపొడుస్తున్నారు. ఇకనైనా తీరుమార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ‘బీఆర్ఎస్లో నాలాంటి ఉద్యమకారులకు, మొదటి నుంచీ పార్టీ వెన్నంటి ఉన్న కార్యకర్తలకు విలువ ఇయ్యలేదు. ఓన్లీ జోకుడుగాళ్లకు, చెంచాగాళ్లను నెత్తిన ఎక్కించుకున్నరు. అందువల్లే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది..’ అంటూ కాసారపు శ్యామ్ అనే బీఆర్‌ఎస్‌నేత కరీంనగర్ రివ్యూ మీటింగ్‌లో ఫైర్ అయ్యాడు.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతుండగా అడ్డు తగిలిన శ్యామ్‌కు మద్దతుగా వందలాది మంది కార్యకర్తలు చప్పట్లు, ఈలలతో మద్దతు తెలుపుతుంటే వేదికపై ఉన్న లీడర్ల మొహాల్లో నెత్తురు చుక్కలేదు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కొత్తగూడెం నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లోనూ ఇదే తీరు! పార్టీలో ఉద్యమ కారులను విలువ లేకుండా పోయిందని సీనియర్ కార్యకర్త, ఎస్టీ విభాగం నేత చందు, సీనియర్ కార్యకర్త సింధు వాపోయారు. తెల్లవారితే ఎన్నికలు జరిగే టైంలో కూడా ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టి చేర్చుకున్నారని ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలకే జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చుకున్నరు.. పదేండ్ల నుంచి జిల్లా కమిటీలు వేయనప్పుడు రూ.కోట్లు ఖర్చు పెట్టి పార్టీ ఆఫీసులు కట్టడం ఎందుకు?’ అని రామగుండం రివ్యూ మీటింగులో బీఆర్ఎస్ అధికార ప్రతినిధులు తోడేటి శంకర్ గౌడ్, నడిపెల్లి మురళీధర్‌రావు నిలదీశారు. దీంతో వేదిక మీద ఉన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్అవాక్కయ్యారు.
మాజీ మంత్రి ముఖం మీదే తిట్టిన్రు..
బీఆర్ఎస్ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదేండ్ల పాటు హవా కొనసాగించారు. ఆ టైంలో ఎమ్మెల్యేలు సైతం ఆయనకు ఎదురు మాట్లాడే ధైర్యం చేయలేదు. అలాంటిది తాజాగా గద్వాలలో జరిగిన రివ్యూ మీటింగులో సెకండ్ క్యాడర్ లీడర్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తూర్పారబట్టారు. -బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లను చెప్రాసీల కన్నా అధ్వానంగా చూశారని గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ఫైర్ అయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఫండ్స్, పవర్స్ లేకుండా పోయాయన్నారు. లోకల్ లీడర్లను, కార్యకర్తలను ప్రభుత్వ పెద్దలు, మంత్రులు పట్టించుకోకపోవడం వల్లే ప్రజలు బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పారని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను దెప్పి పొడిచారు. గద్వాల అభివృద్ధిని అప్పటి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అడ్డుకున్నారని గట్టు ఎంపీపీ విజయ్ కుమార్ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖం మీదే తిట్టేశారు. గతంలో మాదిరిగా వ్యవహరిస్తే పార్టీకి పుట్టగతులు ఉండవని చురక అంటించారు.
పైసలున్నోళ్లకే పదవులు ఇచ్చిన్రు..
జనగామ బీఆర్ఎస్ రివ్యూ మీటింగ్‌లో సెకండ్ క్యాడర్ లీడర్ల ఆవేదన
జనగామ : ‘బీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిన్రు. పైసలున్నోళ్లకే పదవులిచ్చిన్రు. పదవులు కొనుక్కునే శక్తి మాకు లేదు. రాష్ట్రం కోసం కొట్లాడినందుకే బీఆర్ఎస్కు జనం ఓటేసిన్రు కానీ ఇచ్చిన కాంగ్రెస్‌కు వేయలే. కానీ, ఆనాడు కొట్లాడిన వాళ్లను వదిలి కొత్తగా పార్టీలోకి వచ్చినోళ్లకు, పైసలిచ్చినోళ్లకు పదవులిచ్చిన్రు. జనగామలో ఓ రాచరికం, అరాచకం చూశాం’ అని జనగామ ఎంపీపీ మేకల కళింగరాజు, సీనియర్ లీడర్పసుల ఏబేలు వాపోయారు. జనగామ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం జరిగిన జనగామ సెగ్మెంట్రివ్యూకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. వారి సమక్షంలోనే హైకమాండ్ తీరును నేతలు ఎండగట్టారు.
అన్ని పదవులకు కాపోళ్లకే ఇవ్వడం వల్ల ఇయ్యాల పార్టీ ఆగమైందన్నారు. బీఆర్ఎస్ పేరు బాగాలేదని, మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిండ్రని, అది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఉద్యమ టైంలో కలిసి కూర్చొని రౌండ్టేబుల్సమావేశంలా మాట్లాడుకున్నామని, కానీ అధికారంలోకి వచ్చాక అస్సలు కలవనీయడం లేదన్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రులను కూడా కలిసే చాన్స్ లేకుండా చేశారని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ, మున్సిపల్చైర్పర్సన్లు గిరబోయిన భాగ్యలక్ష్మి, పోకల జమున, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, గద్దల నర్సింగరావు, పెద్ది రాజిరెడ్డి, ఇర్రి రమణారెడ్డి పాల్గొన్నారు.
అహంకారం, అహంభావం పెరిగిపోవడం వల్లే ఓడాం
అహంకారం, అహంభావం పెరిగిపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడింది. గెలుపు మాదే అని ఓవర్
కాన్ఫిడెన్స్ కు పోయి గ్రౌండ్ లెవెల్ లో సరిగ్గా పనిచేయలేదు. అందుకే ఓడిపోయాం. రెండోసారి గెలిచిన తర్వాత వలస వచ్చిన నేతలకే ప్రియారిటీ ఇచ్చాం. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలను కేర్ చేయకపోవడం కూడా ఓటమికి కారణమైంది.
-
కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు
సమీక్షలు జరపకుండా ఎన్నికలకు పోతే
అసెంబ్లీ ఫలితాలు రిపీట్
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఊరూరా సమీక్ష జరగాలి. సరైన సమీక్షలు చేయకుండా ఎంపీ ఎన్నికలకు పోతే అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవుతాయి.. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం లోపించడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం.. గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంపముంచింది. ఎమ్మెల్యేలకే కేసీఆర్ పూర్తి అధికారం ఇవ్వడంతో చాలాచోట్ల
క్యాడర్‌ను లెక్క చేయలే, ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న లీడర్లను, క్యాడర్‌ను పక్కనపెట్టి కొత్తగా వచ్చినవాళ్లకు ప్రియారిటీ ఇవ్వడం వల్ల పాత క్యాడర్ నారాజ్ అయింది.. దీంతో ప్రచారంలో వెనుకబడ్డాం.
యాదగిరి గుట్ట రివ్యూ మీటింగులో కడియం