35 వేల కోట్ల రూపాయలతో తమ్మిడి హట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను పక్కకు పెట్టి, స్వీయ ప్రయోజనాలకు వేలకోట్ల కమిషన్లు దండుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును లోపభూయిష్టమైన డిజైన్ చేసి లక్ష 30 వేల కోట్ల రూపాయలకు పూర్తిచేసి పట్టుమని నాలుగు సంవత్సరాలు పూర్తి కాకముందే మేడిగడ్డ పిల్లర్లు వరుసగా ఒకటి తర్వాత ఒకటి కుంగిపోవడం తెలంగాణ రైతులను పేద ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
పాలకులు ఇలాంటి క్షమించరాని పొరపాట్లు కొన్ని శిక్షలున్నాయి. వరుసగా నిర్మించిన బ్యారేజీలు ఒకదాని వెంట ఒకటి కుంగిపోవడం వెనుక ఎంత అవినీతి జరిగిందో అంచనా వేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి 80,000 పుస్తకాలు చదవనక్కరలేదు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ మిషన్ లాంటి అనేక ప్రాజెక్టులను అవినీతి లక్ష్యంగా పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల డబ్బును వృథా చేసి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆంధ్ర కాంట్రాక్టర్లు అందినంత అవినీతి చేసి దాచుకున్నారని కాళేశ్వరం ప్రాజెక్టు ఉదంతం ద్వారా తెలుస్తోంది.
ఓటు ధర పెంచినా..
ఓట్లు కొనుగోలు చేసి అధికారం పొందిన నాయకులు అంతా అదుపు ఆజ్ఞ లేకుండా ఏ నియంత్రణ లేకుండా ప్రజాధనాన్ని, రాష్ట్ర వనరులను సొంతం చేసుకున్న వైనం గమనించిన తెలంగాణ ప్రజలు ప్రస్తుత సాధారణ ఎన్నికల సమయంలో తమదైన శైలిలో స్పందించడానికి సిద్ధపడుతున్నారు. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో పంచినట్లుగా రూ.6 వేలు కాదు పదివేలు పంచిపెట్టినా ఓటర్లు ప్రజాస్వామ్యానికి ఒక ప్రత్యామ్నాయనికి మాత్రమే ఓటు వేసే దిశలో ఆలోచిస్తున్నారు. ఓటు ఆయుధంతో నోట్ల పార్టీలను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు.
దోపిడీకి గురైన ప్రజల సంపద
అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అనతి కాలములోనే వందలాది ఎకరాలకు యజమానులైనారు. బిలియన్ల కొద్దీ డబ్బు సంపాదించి ఫామ్ హౌసులు, ఎస్టేట్లు, కాంట్రాక్టులు, కార్పొరేట్ కళాశాలలు, హాస్పిటల్స్ , మాల్స్, వ్యాపార సంస్థలను బినామీల పేరుతో సొంతం చేసుకున్నారు. రాష్ట్ర సహజ వనరులు గ్రానైటు, ఇసుక క్వారీలు, ప్రభుత్వ భూములు, ఇతర ఖనిజాలు సొంతం చేసుకోవడం జరిగిందని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన కీలక ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను ఆస్తులను 90 ఏండ్ల లీజుకు తీసుకున్నారు. 2014 నుంచి 2023 సాధారణ ఎన్నికలకు మధ్యకాలంలో మన ఎమ్మెల్యేల మంత్రుల ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయనీ అంచనా వేయడం సాధ్యపడకపోవచ్చు.
డబ్బు సంచులకు, ప్రజాస్వామ్యానికి పోరాటమిది
ప్రజాస్వామ్యంలో ఉన్న రాష్ట్రాన్ని ఒక వారసత్వ సంపదగా మార్చుకున్న వైనం గమనిస్తున్న విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు, ఉద్యోగులు అనేక రంగాల్లో పనిచేస్తున్న బుద్ధి జీవులు చైతన్యవంతమైన ప్రజలు ఓటర్లు ప్రస్తుత ఎన్నికలను ఒక చాలెంజ్‌గా తీసుకున్నారు. ఇది టీఆర్ఎస్ డబ్బు సంచులకు, ప్రజాస్వామ్యవాదులైన ప్రజలకు మధ్యన జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నారు.
మద్యం ఆదాయం అనాథలను చేస్తున్నది
ఇక మద్యం వ్యాపారమే ప్రధాన వనరుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామానికి గల్లీ గల్లీ కి తండా తండాకు పల్లె పల్లెకు మద్యం షాపులను తెరిపించి.. 2014లో ఉన్న రూ. 8 వేల కోట్ల ఆదాయం నుంచి ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు పెంచుకోవడం జరిగింది. 50 శాతం మగవాళ్లు యుక్త వయస్సులో ఉన్న విద్యార్థి, యువకులు మద్యపాన వ్యసనానికి గురి అవుతున్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యుక్త వయస్కులైన పురుషులు అనారోగ్యానికి, రకరకాల ప్రాణాంతక రోగాలకు గురి అయి మరణిస్తున్నారు. మహిళలు, పిల్లలు, అనాధలవుతున్నారు. ప్రభుత్వ మద్యపాన వ్యాపార విస్తరణ ద్వారా తెలంగాణ సమాజం నిర్వీర్యమవుతున్నది. శ్రామికులు శక్తిని కోల్పోతున్నారు. రాష్ట్రమంతా ఇతర రాష్ట్రాల శ్రామికులపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడింది.
ఆర్థిక పరిస్థితి కుప్పకూలింది
కేసీఆర్‌పాలన ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించి ప్రభుత్వ విద్యా సంస్థలను సర్వనాశనం చేసిన కారణంగా పేదలు నాణ్యమైన ఉన్నత విద్యకు శాశ్వతంగా దూరం చేయబడ్డారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పది ఏండ్లలో చిన్నాభిన్నమై కుప్పకూలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ.4 వేల నుంచి రూ.5వేల కోట్ల వడ్డీలు చెల్లించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ప్రతి నెల ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లు సంక్షేమ హాస్టల్ ల బిల్లులు హాస్పిటల్స్ లో మెడికల్ బిల్లులు చెల్లించలేని ఆర్థిక సంక్షోభం విలయతాండవం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం10 ఏండ్లలో ఐదు లక్షల 50 వేల కోట్ల రూపాయల నికర అప్పును తెలంగాణ ప్రజల నెత్తిన మోపింది. ప్రతి తెలంగాణ పౌరునికి లక్ష యాభై వేల రూపాయల అప్పు మిగిల్చింది.
రాష్ట్రాన్ని వారసత్వ సంపదగా..
ఒక్క కుటుంబం తమ ఈ రాష్ట్రాన్ని తమ వారసత్వ సంపదగా ఏర్పాటు చేసుకునే దిశలో చాలావరకు ముందుకు సాగినారు. వీరికి తోడు వందలాదిమంది కార్పొరేట్ దిగ్గజాలను కూడా పెంచి పోషించి కల్వకుంట్ల కుటుంబానికి బాసటగా నిలబెట్టుకున్నారు. కార్పొరేటు సంస్థల యజమానులు, కొంతమంది నాయకులు, కుటుంబం మాత్రమే అధికారాన్ని సంపదను సహజ వనరులను హస్తగతం చేసుకుంటున్నారు. ప్రజలంతా కేవలం డొల్ల పథకాలకు ఎదురుచూసే బానిసలుగా మారుతున్నారు. ప్రపంచ ప్రజాస్వామ్యంలో, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోగానీ ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థలకు అవకాశం ఉంటుందా అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు.
పాలక నియంత్రణలో మీడియా
అవినీతి అధికారుల అండదండలతో ఈ కుటుంబ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు అమలు చేసినప్పటికీ, ముఖ్యమైన కొన్ని వార్తాపత్రికలను, టీవీ చానెళ్లను కొనుగోలు చేసి మిగిలిన వాటిని నయానా, భయానా కఠినంగా నియంత్రించినప్పటికీ మాట్లాడే వారి గొంతులు నొక్కినప్పటికీ , పాత కేసులు తోడతామని వేలాది మంది ఉద్యమకారులను బైండోవర్ చేసినప్పటికీ మేధావులు ఉద్యమకారులు విశ్రాంత ఉద్యోగులు బుద్ధి జీవులు అనేక వేదికల ద్వారా సదస్సులు నిర్వహించి తెలంగాణలో జరుగుతున్న అవినీతి, దోపిడి, అస్తవ్యస్త పాలన గురించి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉన్నారు.
ఇంకా మోసపోతే మాట్లాడేవారు ఉండరు
ఓటుకు పదివేల చొప్పున ఓటర్లకు ఇవ్వడానికి లక్షలాది మందిని ఓట్లు కొనుగోలు చేసే ఏజెంట్లను పెట్టి ఓట్లఅంగడిని వశం చేసుకోవాలని కుట్ర పన్నుతున్న పార్టీలను పసిగట్టవలసిన అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండకపోతే ఇక మూడవసారి కూడా మోసపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ కాపాడలేరు. తెలంగాణ వనరులకు రక్షణ ఉండదు. భారత పెట్రోల్ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం మరో నైజాం పాలనకు వశమై ఏండ్ల తరబడి మోయవలసిన దుర్భర పరిస్థితులు ఏర్పడతాయి. ఇది అందరి బాధ్యత అని గుర్తెరిగి ఈ సాధారణ ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకు డబ్బు సంచుల బారిలో పడకుండా ప్రజలను కాపాడవలసిన అవసరం ఉంది. తెలంగాణ వనరులను సంస్థలను ఆస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని పునరుద్ధరించవలసిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కమిటీ అభ్యర్థిస్తున్నది.
మళ్లీ వస్తే.. పన్నులు బాదుడే
పన్నులు పెంచకుండా, విలువైన భూములు అమ్మకుండా, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడం అత్యంత క్లిష్టమైన సమస్యే. మళ్లీ కేసీఆర్ సీఎం అయితే డీజిల్ పై మరో రూ.30, మద్యం సీసాల పై మరో రూ.200, ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజు ప్రస్తుత 7:30 శాతం నుంచి 10%, వాహన రిజిస్ట్రేషన్ల చార్జీలు 200% కరెంటు చార్జీలు మరో రెండు వందల శాతం, ఆర్టీసీ చార్జీలు పెంచడం ఖాయం. ప్రభుత్వ భూములు ఒక్క అంగుళం కూడా మిగలకపోవచ్చు. ధరణి దుర్మార్గపు వ్యవస్థతో కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకులు స్వంతం చేసుకున్నారు అని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జైలు కూలగొట్టి పది ఎకరాల భూమిలో హాస్పిటల్ నిర్మించినప్పటికీ ఈ భూమిని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టారు. ఇదే ప్రభుత్వం మళ్లీ ఎన్నిక అయితే వరంగల్‌లో ఉన్న విలువైన భూములు కూడా దక్కవు.
- ప్రొ. కూరపాటి వెంకట్ నారాయణ,
తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ