
- వెహికల్ రూట్ మ్యాప్ కోసం ఎల్కతుర్తి పెద్దవాగుకు అడ్డంగా మట్టికట్ట
- దేవాదుల కాలువ పలుచోట్ల పూడ్చివేత
- ఆపరేషన్ నైట్ షిఫ్ట్ తో మొరం అక్రమ రవాణా
- గెట్లు చెడగొడుతుండడంతో ఆందోళనలో రైతులు
హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం పంటలకు సాగు నీరందించే వాగుతో పాటు దేవాదుల కాలువలను ధ్వంసం చేస్తున్నారు. పార్టీ మీటింగ్ కు వచ్చే వెహికిల్స్ పార్కింగ్ కోసం ఎక్కడికక్కడ కాలువలను పూడ్చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి మట్టి, మొరాన్ని తీసుకొచ్చి వెహికల్ రూట్ మ్యాప్ ప్రకారం రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తమకు సాగు నీరందించే కాలువలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు పొలాల మధ్య గెట్లు చెడగొడుతూ చదును చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
1,213 ఎకరాలకుపైగా సాఫ్..
గులాబీ పార్టీ ఏర్పడి 25 ఏండ్లు అవుతున్న సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలోని చింతలపల్లి వద్ద రజతోత్సవ మహాసభకు ఏర్పాట్లు చేస్తోంది. మెదక్–ఎల్కతుర్తి, వరంగల్–-కరీంనగర్ హైవేలకు సమీపంలో దాదాపు 1,213 ఎకరాలను సాఫ్ చేస్తున్నారు. అందులో 154 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేయనుండగా.. మిగతా 1,059 ఎకరాలకు పైగా స్థలంలో పార్కింగ్, భోజనశాలలు, ఇతర కార్యక్రమాలకు వాడుకునేలా సభా ప్రాంగణం మ్యాప్ తయారు చేశారు. ఏప్రిల్ 2న సభ పనులకు శ్రీకారం చుట్టి, అక్కడి నేలను చదును చేస్తున్నారు. నిత్యం మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలు విజిట్ చేస్తూ దగ్గరుండి మరీ పనులు చేయిస్తున్నారు.
వాహనాల కోసం కాల్వలు పూడ్చివేత..
బీఆర్ఎస్ బహిరంగసభకు వివిధ జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మందిని చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ మీదుగా వచ్చే వాహనాల కోసం ఎల్కతుర్తి సుర వైన్స్ సమీపంలో, సిద్దిపేట, కరీంనగర్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ కోసం ఎల్కతుర్తి-, హుస్నాబాద్ రూట్ లో పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేస్తున్నారు.
సభా ప్రాంగణానికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేరుకునేలా ఎక్కడికక్కడ వాహనాలను మళ్లించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి అనంతసాగర్ మీదుగా వచ్చే వెహికల్స్ పార్కింగ్ ప్లేస్కు చేరుకునేందుకు ఎల్కతుర్తి పెద్దవాగు మీదుగా మట్టి రోడ్డు వేస్తున్నారు. పెద్దవాగును పూడ్చేసి, పార్కింగ్ ప్లేస్ కు వెళ్లేలా చదును చేస్తున్నారు.
దేవాదుల కాలువ ఎక్కడికక్కడ ధ్వంసం..
మెదక్ వైపు నుంచి సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఇందిరానగర్, గోపాల్పూర్, ఎల్కతుర్తి రోడ్డులో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరానగర్ నుంచి ఎల్కతుర్తి శివారు భూముల కోసం తవ్విన దేవాదుల 1ఆర్, 2ఆర్ డీ-6 ఉప కాలువను దాదాపు 20 చోట్ల మొరంతో పూడ్చేసి, పార్కింగ్ స్థలాలకు రోడ్లు పోస్తున్నారు. దామెర చింతలపల్లి రూట్లోని డీ3 కాల్వను కూడా మట్టితో క్లోజ్ చేశారు. ఇక దామెర సమీపంలో రోడ్డు వెంట ఉన్న చెత్తా చెదారంతో పాటు దారి పక్కన ఉన్న తుమ్మ చెట్లను నరికి డోజర్లతో కాలువల్లోకి నెట్టారు.
ఆపరేషన్ నైట్ షిఫ్ట్.. ఆఫీసర్ల సపోర్ట్!
సభా ప్రాంగణంతో పాటు పార్కింగ్ ప్లేసులు, రోడ్ల అవసరాల కోసం హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టి, మొరాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హుస్నాబాద్ సమీపంలోని జిల్లెలగడ్డ, మీర్జాపూర్ గుట్టల నుంచి మొరం తవ్వుకొస్తుండగా, ఎల్కతుర్తిలోని మల్లన్నకుంట నుంచి రాత్రికి రాత్రి వందలాది ట్రిప్పుల మట్టి, మొరం తవ్వి షిఫ్ట్ చేస్తున్నారు. అనంతరం కాలువలను పూడ్చి రోడ్లు వేస్తున్నారు.
ఎలాంటి పర్మిషన్లు లేకుండా వందల ట్రిప్పుల మట్టి, మొరం తరలించుకుపోతున్నా.. క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పార్టీ మీటింగ్ కోసం సాగు నీరందించే కాలువలను పూడ్చడం పట్ల విమర్శలు వ్యక్తమవుతుండగా, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గెట్ల చదునుతో గందరగోళం..
సభకు వాడుతున్న భూములన్నీ పొలాలు, చేలు కావడం, వాటిని ఎక్కడికక్కడ చదును చేస్తున్నారు. గెట్టురాళ్లు తొలగించి, ఒడ్లు సాఫ్ చేయిస్తున్నారు. ఇప్పటికే దుక్కులు చేసుకొని పశువుల ఎరువులు చల్లుకున్న చెల్కలను రోలర్లతో తొక్కిస్తున్నారు. సభా వేదిక వద్ద కాంక్రీట్ మిక్చర్ తో వేదిక సిద్ధం చేశారు. ఫలితంగా అక్కడి భూములన్నీ గెట్లు కోల్పోయి గ్రౌండ్ ను తలపిస్తున్నాయి. కాగా, సభ తరువాత గెట్ల పంచాయితీలు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే వేదిక వద్ద ఉన్న రెండు వేప చెట్లను నామరూపాలు లేకుండా తొలగించారు. ఇతర కాలువలు, రోడ్ల వెంట ఉన్న పదుల సంఖ్యలో చెట్లను తొలగించినా అడిగే వారే కరువయ్యారు.