గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
  • రెండోసారి బరిలోనిలవని గులాబీ పార్టీ
  • కేసీఆర్, హరీశ్​, కేటీఆర్, కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న చోట 
  • పోటీ చేయకపోవడంపై పొలిటికల్​వర్గాల్లో చర్చ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్–మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నది. ఈ స్థానంలో వరుసగా రెండోసారి బరిలో నిలువలేదు. 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకూ దూరంగా ఉన్న ఆ పార్టీ..  గ్రూప్ –1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ కు బయటి నుంచి  మద్దతు ఇచ్చింది కానీ.. సొంతంగా అభ్యర్థిని నిలబెట్టలేదు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అటు వరంగల్–ఖమ్మం– నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వరుసగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. గత రెండు దఫాలుగా కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. 

 4 ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో ప్రభావం చూపించే ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ చీఫ్​ కేసీఆర్‌సహా హరీశ్​, కేటీఆర్, కవిత ఈ స్థానం పరిధిలోనే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ కోసం మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు, ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, ఓయూ జేఏసీ మాజీ నేత రాజారాం యాదవ్ పోటీ పడినప్పటికీ.. కేసీఆర్​ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. చివరి నిమిషం వరకు పార్టీ బీఫామ్ కోసం ఎదురు చూసిన రవీందర్ సింగ్.. సోమవారం ఇండిపెండెంట్ గానే రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.