వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్, రెవిన్యూ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మంగళవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించిన ఆర్ఎస్పీ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల అమాయక రైతులు బలవుతున్నారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని విజయవంతంగా పాలించిన బీఆర్ఎస్ పార్టీ అధికారులపై దాడులను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. అధికారులపై దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏదైనా కంపెనీ ప్రారంభించే ముందు స్థానిక రైతులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలి.. కానీ రైతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం లేకుండా పోయిందన్నారు.
రైతులు రేవంత్ రెడ్డిని కలవానుకుంటుంటే ఆయన పోలీసులను అడ్డుకుపెట్టుకుంటున్నాడని విమర్శించారు. అధికారులను కవచంగా పెట్టి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేశారు. పేద రైతులు వందలాది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని.. ఆరుగాలం కష్టపడి పంట కోతకొచ్చిన సమయానికి రైతులను అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గ్రామంలో కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై దాడికి కారణం సీఎం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. నక్సల్ ప్రాంతంలో ఇంటర్నెట్ బంద్ చేయడం చూశాం.. కానీ రైతులు తమ భూముల కోసం కొట్లాడుతుంటే కొడంగల్లో ఇంటర్నెట్ బంద్ చేశారన్నారు.
ALSO READ | సురేష్ మా కార్యకర్తే.. ఆయనకు భూమి ఉంది: కలెక్టర్పై దాడి ఘటనపై పట్నం నరేందర్ రెడ్డి
ఇంటర్ నెట్ బంద్ చేసి రైతులను తీవ్రవాదులుగా, దేశ ద్రోహులుగా చూస్తున్నారా..? అనేది ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ కొలిమిలా మారితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ, కేరళ యాత్రలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రైతులను పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు వస్తే మమ్మల్ని అడ్డుకున్నారని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాగా, వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాప్రాయం తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే.