ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో రెండు పిటీషన్లు దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. 2025, జనవరి 16వ తేదీన ఈ అంశంపై ఢిల్లీలో లీగల్ టీంతో చర్చించిన మాజీ మంత్రి హరీశ్ రావు.. పిటీషన్లు వేయాలని నిర్ణయించి.. ఆ మేరకు దాఖలు చేశారు.
ఎమ్మెల్యేల అనర్హత అంశంపై రెండు పిటీషన్లు వేసింది బీఆర్ఎస్ పార్టీ. పోచారం, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వీళ్లను అనర్హులుగా ప్రకటించాలని.. ఆ మేరకు తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ ద్వారా సుప్రీంకోర్టును కోరింది బీఆర్ఎస్ పార్టీ.
Also Read :- తెలంగాణా లో ఓడించాం.. అసలు పార్టనర్ను ఢిల్లీలో ఓడిస్తాం
అదే విధంగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అయిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిలపై స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది.
ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేం అని.. గడువు విధించలేం అని స్పష్టం చేసింది హైకోర్టు. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో రెండు పిటీషన్స్ వేసింది బీఆర్ఎస్ పార్టీ.