యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో ధర్మం గెలిచిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించినందుకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో రాజకీయాలను బీజేపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు మునుగోడు ఉప ఎన్నికతోనే పునాదులు పడ్డాయని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ దేశమంతా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసేలా దీవించమని లక్ష్మి నరసింహస్వామికి మొక్కుకున్నానన్నారు. పూజలు చేసి.. కేసీఆర్ పేరిట అర్చన కూడా చేయించానని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.