బీఆర్ఎస్ లో అర్బన్ టెన్షన్ !

  • మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్​ క్యాడర్ ఖాళీ 
  • పాలకవర్గాలన్నీ కాంగ్రెస్​ ఖాతాల్లోకే.. 
  • రూరల్ ఓటర్లకు గాలం వేసేందుకు ప్లాన్​
  • ఎన్నికల కార్యాచరణ అక్కడి నుంచే ప్రారంభం

నల్గొండ, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్​పార్టీకి అర్బన్​ టెన్షన్​పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసిన బీఆర్ఎస్​ చివరకు చతికిల పడింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన రెండు నెలల వ్యవధిలోనే జిల్లాలోని మున్సిపాలిటీలన్నీ ఒక్కొక్కటి కాంగ్రెస్ ఖాతాల్లో చేరిపోయాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు నచ్చక ఎన్నికలకు ముందే కొందరు కాంగ్రెస్​లో చేరిపోగా, బీఆర్​ఎస్​ అధికారం కోల్పోవడంతో  రాజకీయ భవిష్యత్​ ఉండదని భావించిన మరికొందరు చైర్మన్లు, కౌన్సి లర్లు కాంగ్రెస్ గూటికి చేరారు.

కాంగ్రెస్​లో చేరిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టించి చైర్మన్లను గద్దె దించారు. దీంతో ప్రస్తుతం సూర్యాపేట, ఆలేరు, భూదాన్​పోచంపల్లి, చండూరు, నకిరేకల్, మిర్యాలగూడ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్​పాలకవర్గాలు కొలువుదీరాయి. బీఆర్ఎస్​బలంగా ఉన్న పట్టణాల్లో పార్టీ కేడర్ దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థంకాక గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

భువనగరి ఎంపీ సెగ్మెంట్​లోనూ అదే సీన్..

భువనగిరి ఎంపీ సెగ్మెంట్​పరిధిలో ఆలేరు, పోచంపల్లి, చండూరు, నకిరేకల్​మున్సిపాలిటీలు మాత్రమే బీఆర్​కు మిగిలాయి. యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పుల్, మోత్కూరు, చిట్యాల కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. దీంతో ఇక్కడ కూడా పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లోకి వలసలు భారీగా పెరిగాయి. ఎంపీపీలు, జడ్పీటీసీలు సైతం బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పడంతో ఇక్కడ పార్టీకి సవాల్​గా మారింది.

ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్​జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాకపోవడంతో పార్టీ కేడర్​ మరింత అయోమయంలో పడింది. ఇప్పటికిప్పుడు పార్టీని చక్కపెట్టే పరిస్థితులు కూడా లేకపోవడం, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు రాకుండా పోవడంతో అర్బన్ కేడర్​ డైలమాలో పడింది. చేజారిపోతున్న మున్సిపాలిటీలను కనీసం కాపాడుకునే ప్రయత్నాలు కూడా చేయలేదు. దీంతో ఆ ప్రభావం ఎంపీ ఎన్నికలపై తీవ్రంగా పడనుంది. 

రూరల్​ ఓటర్ల పైనే ఆశలు..

పట్టణ ఓటర్ల మీద బీఆర్ఎస్ ఆశలు కోల్పోయింది. దీంతో కనీసం రూరల్​ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎండిపో యిన పంటలు, ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాలతో ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనకు వచ్చింది. వానల్లేక కరువుతో ఎండిపోయిన పంటలనే ఎ న్నికల్లో ప్రధాన అస్త్రాలుగా వాడుకోవాలని బీఆర్ఎస్​ చూస్తోంది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్నా నాలుగు వేల పింఛన్​గురించి మాట్లాడటం లేదని, అందరికీ రైతుబంధు అందలేదనే విషయాలను ప్రజలకు వివరించాలని చూస్తోంది.

కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు రూరల్​లోనే ఎక్కువ డ్యామేజ్ అయ్యింది. ప్రస్తుతం సర్పంచులు కూడా పవర్​లో లేరు. ఇక ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల, గ్రామ శాఖల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్లమెం ట్​అయ్యాక జరిగే స్థానిక ఎన్నికలపైనే స్థానిక నేతల దృష్టి నెలకొంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకే త్వరలో మాజీ సీఎం కేసీఆర్​ను నల్గొండ, యాదాద్రి జిల్లాలకు రప్పించాలని ప్లాన్​ చేస్తున్నారు. నల్గొండ నియోజకవర్గంలోని ముషంపల్లి గ్రామాన్ని కేసీఆర్​ స్వయంగా విజిట్​చేస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదేవిధంగా మూసీ కింద ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్​యాదాద్రి జిల్లాలో కూడా పర్యటించవచ్చని తెలిసింది. 

పార్టీ తరఫున ప్రచారం ఎట్లా..? 

ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఒక ఎత్తైతే.. కింది స్థాయిలో కేడర్​ను నడిపించే స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పార్టీని వీడిపోవడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. నల్గొండ ఎంపీ సెగ్మెంట్​పరిధిలో నల్గొండ, దేవరకొండ, నేరేడుచర్ల, హుజూర్​నగర్, కోదాడ మున్సిపాలిటీలు కాంగ్రెస్​ ఖాతాలో చేరాయి. దీంతో ఇప్పుడు ఇక్కడ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి కేడర్ కరువైంది. ఎంపీ అభ్యర్థిని ప్రకటించాక కూడా పార్టీలో జోష్​ కనిపించడం లేదు. వార్డు ల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడంలో కౌన్సిలర్లు, మున్సిపల్​చైర్మన్​పాత్ర కీలకం.

కానీ, ప్రస్తుతం నల్గొండ లాంటి పెద్ద మున్సిపాలిటీలోనే బీఆర్ఎస్​తరఫున ప్రచారం చేయడానికి ఒక్కరు కూడా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల నందికొండ, హాలియా మున్సిపాలిటీలు సైతం కాంగ్రెస్​ ఖాతాలో చేరడంతో ఆ ఎఫె క్ట్​ రూరల్​ఓటర్ల పై పడనుంది. దేవరకొండలో పాలకవర్గం అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే మాజీ ఎమ్మెల్యేపై దూకుడు ప్రదర్శించింది. అసెంబ్లీ ఎన్నికలయ్యాక పార్టీ కేడర్​మొత్తం చెల్లాచెదురైంది. ఇక ఇప్పుడు కవిత అరెస్ట్​ కావడంతో పార్టీని మరింత కలిచివేసింది. పైగా ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కొత్తవారు కావడం కూడా పెద్ద సమస్యగా మారింది.