
- పార్టీ జిల్లా ఆఫీసు, మమత కాలేజీలో సెపరేట్ గా సంబురాలు
- త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, అయినా కలవని మనసులు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కారు పార్టీలో ఎవరికి వారే అన్నట్టుగా వర్గాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయి 15 నెలలు అవుతున్నా, ఆ పార్టీ లీడర్ల తీరు మారలేదు. ఇప్పటికీ వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు కూడా నేతలను కలపలేకపోయాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డే జరిపారు. ఈ ప్రోగ్రామ్ లో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, కొందరు కార్పొరేటర్లు పాల్గొని కేక్ కట్ చేశారు.
ఖమ్మం నగరంలోనే ఉన్నా ఈ ప్రోగ్రామ్ కు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దూరంగా ఉన్నారు. ఆయన మమత కాలేజీ ఆవరణలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ మార్కెట్ చైర్మన్ఆర్జేసీ కృష్ణ, నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మరికొందరు కార్పొరేటర్లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో సంబురాలు, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కొందరు కార్పొరేటర్లు, లోకల్ నేతలు తర్వాత హుటాహుటిన మమత క్యాంపస్ లో జరిగిన ప్రోగ్రామ్ కు పరుగులు తీశారు. ఏ ప్రోగ్రామ్ కు వెళ్లకుంటే ఎవరు హర్ట్ అవుతారోనని టెన్షన్ పడ్డారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఖమ్మం జిల్లా పార్టీలో వర్గ పోరు కొనసాగుతోంది. . నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కార్యక్రమాలు సహా పలు సందర్భాల్లో ఈ విషయం బయటపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కూడా వర్గాలు కొనసాగాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఈ వర్గ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఏకతాటిపై లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయింది.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు 2.65 లక్షల ఓట్ల లీడ్ వచ్చింది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4.67 లక్షల మెజార్టీ కాంగ్రెస్ కు వచ్చింది. దీంతో ఆర్నెళ్లలోనే 2 లక్షల ఓట్లను బీఆర్ఎస్ కోల్పోయింది. అయినా పార్టీలోని ముఖ్య నేతల తీరు మారలేదు.
గత 15 నెలల్లో చాలా మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువ రోజులు హైదరాబాద్ కే పరిమితం కావడంతో జిల్లాలో పార్టీ కార్యకర్తలు నీరసపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రమే తరచుగా జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మూడు, నాలుగుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా హైదరాబాద్ లో ఉంటూ ఖమ్మంలో ప్రైవేట్ కార్యక్రమాలకు మాత్రమే అప్పుడప్పుడు హాజరవుతున్నారు. ఒకవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి.
రెండు మూడు నెలల్లోనే ఎలక్షన్లు జరిగే అవకాశముంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఆ పార్టీకే నష్టదాయకంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గాలుగా మారి, వేర్వేరుగా కార్యక్రమాలు చేయడం వల్ల పార్టీ జనంలో మరింత పలచబడిపోతుందని ఆ పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు.