కారు కార్ఖానాకే..! .. ఓరుగల్లులో గులాబీ పార్టీ మస్త్​ డ్యామేజ్‍

కారు కార్ఖానాకే..! .. ఓరుగల్లులో గులాబీ పార్టీ మస్త్​ డ్యామేజ్‍
  • చేజారిన రెండు సిట్టింగ్‍ ఎంపీ స్థానాలు 
  • అసెంబ్లీ ఎన్నికల్లోనూ 10 నియోజకవర్గాల్లో ఓడిన బీఆర్‍ఎస్‍
  • గెలిచిన ఇద్దరిలో కాంగ్రెస్‍ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే కడియం
  • పార్టీలు మారిన ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు
  • వరుస ఓటములతో అయోమయంలో లీడర్లు, కేడర్‍

వరంగల్‍, వెలుగు: కారు పార్టీ మస్త్​డ్యామేజ్​అయ్యింది.! ఓరుగల్లులో డీలా పడిపోయింది. వరుస ఓటములతో లీడర్లు, కేడర్‍ డిసప్పయింట్‍ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల పరాభవం నుంచి ఓటమిపాలైన మంత్రులు, ఎమ్మెల్యేలు కోలుకోకముందే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడారు. ఆ పార్టీకి వెన్నుముకగా చెప్పుకున్న ఓరుగల్లులో రెండు సిట్టింగ్‍ ఎంపీ సీట్లు సైతం దూరం కావడంతో బీఆర్‍ఎస్‍ ఉనికి ప్రమాదంలో పడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లాలో ఎంతో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎలాగైతే క్రమక్రమంగా తుడిచిపెట్టుకుపోయిందో అదే సీన్‍ ఇప్పుడు గులాబీ పార్టీ విషయంలోనూ కనిపిస్తోంది.

కంచుకోటకు బీటలు.. 

మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లనాటికి ఉమ్మడి వరంగల్‍ జిల్లా బీఆర్‍ఎస్‍ కు కంచుకోటగా ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్‍ చైర్మన్లు.. ఇలా 40 నుంచి 50 మంది పెద్దపెద్ద పోస్టులో ఉమ్మడి జిల్లా అంతటా కవర్‍ చేశారు. ఇక్కడ అసలు ప్రతిపక్షం ఉందా అనుమానం ఉండేది. మంత్రులుగా ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍, ప్రభుత్వ చీఫ్‍విప్‍గా దాస్యం వినయ్‍ భాస్కర్‍, ఎమ్మెల్సీలుగా సిరికొండ మధుసూదనాచారి, బండా ప్రకాశ్‍, బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్‍రావు, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‍రెడ్డితో జిల్లా పార్టీ బలంగా కనిపించింది. 

గ్రేటర్‍ మేయర్‍గా గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యులుగా జిల్లాకే చెందిన కెప్టెన్‍ లక్ష్మీకాంతారావు, వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర రైతు సమన్వయ సమితి, రైతు రుణ విమోచన కార్పొరేషన్‍, వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్లుగా పల్లా రాజేశ్వర్‍రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి, రోడ్లుభవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్‍గా మెట్టు శ్రీనివాస్‍తోపాటు మరో మూన్నాలుగు సంస్థల కార్పొరేషన్‍ చైర్మన్లుగా మరెందరో ఓరుగల్లు నుంచి ప్రభుత్వంలో గౌరవప్రదమైన పోస్టులో ఉండటంతో బీఆర్‍ఎస్‍ తీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు సాగింది.

అసెంబ్లీ ఎలక్షన్లలో పెద్ద దెబ్బ..

రాష్ట్రంలో 2023 డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీఆర్​ఎస్ పార్టీని 20 ఏండ్ల తర్వాత కుంగతీసే ఫలితాలు ఇచ్చింది. ఉమ్మడి వరంగల్​లో  12 ఎమ్మెల్యే నియోజకవర్గాలుంటే, 2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్​10 స్థానాలు కైవసం చేసుకుంది. ములుగు నుంచి సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ మాత్రమే కాంగ్రెస్‍ నుంచి గెలిచారు. ఇందులో గండ్ర సైతం గులాబీ కండువా కప్పుకోవడంతో సీతక్క తప్పితే జిల్లాలో ప్రతిపక్షమే లేకుండా అయింది. 

కాగా, 2023 ఎలక్షన్లలో సీన్‍ రివర్స్​అయింది. బీఆర్‍ఎస్‍ స్థానంలోకి ఇప్పుడు కాంగ్రెస్‍ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హస్తం పార్టీ 10 ఎమ్మెల్యేలు గెలిస్తే, కారు పార్టీ 2 స్థానాలకే పరిమితమైంది. బీఆర్‍ఎస్‍ తరఫున కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‍రెడ్డి గెలవగా, కడియం సైతం కాంగ్రెస్‍ కండువా కప్పుకోవడంతో కేవలం పల్లా రూపంలో ఒక్క ఎమ్మెల్యే మిగిలాడు. ప్రభుత్వం మారడంతో మంత్రులు, కార్పొరేషన్‍ పోస్టులు పోయాయి.

రెండుచోట్లా సిట్టింగ్‍ ఎంపీ స్థానాల్లో ఓటమి..

అసెంబ్లీ ఎలక్షన్ల దెబ్బ నుంచి బయటపడకముందే రాష్ట్రంలో లోక్‍సభ ఎన్నికలొచ్చాయి. ఈ క్రమంలో ఓరుగల్లులోని వరంగల్‍, మహబూబాబాద్‍ పార్లమెంట్‍ సీట్లు ఇన్నాళ్లూ బీఆర్‍ఎస్‍ ఖాతాలోనే ఉన్నాయి. కాగా, లోక్‍సభ నోటిపికేషన్‍ రావడంతోనే పార్టీలోని సీనియర్లు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి క్యూ కట్టారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పార్టీ వరంగల్‍ అధ్యక్షుడు ఆరూరి రమేశ్‍, సిట్టింగ్‍ ఎంపీ పసునూరి దయాకర్‍, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‍, గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్‍ మార్నేని రవీందర్‍రావువంటి సీనియర్‍ నేతలు పార్టీకి దూరమయ్యారు. 

ఇవన్నీదాటి పార్లమెంట్‍ ఎన్నికలకు వెళ్తే.. మంగళవారం వెలువడిన ఎంపీ ఫలితాల్లో బీఆర్‍ఎస్‍ పార్టీ రెండు సిట్టింగ్‍ స్థానాలను కోల్పోయింది. సిట్టింగ్‍ ఎంపీ మాలోతు కవిత, మారేపల్లి సుధీర్‍ కుమార్‍ ఓటమి చెందారు. నిన్నటి లోక్‍సభ ప్రచారం వరకు కూడా ''రాబోయే రోజులు మనవే.. ఏ ఎలక్షన్‍ వచ్చిన గెలుపు మనదే”అంటూ కేసీఆర్‍, కేటీఆర్‍, హరీశ్​రావు చెప్పుకురాగా, ఫలితాలు భిన్నంగా ఉండడంతో లీడర్లు, కేడర్‍ ఇక అయోమయంలో పడ్డారు. పొలిటికల్‍గా యాక్టివ్‍ ఉండాలనుకునేటోళ్లు పార్టీమారే ఆలోచనలో పడ్తున్నట్లు తెలుస్తోంది.