- లబ్ధిదారుల పూర్తి వివరాలు ఇవ్వండి
- ఇంటర్నల్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్
- జిల్లా ఆఫీసర్లతో అత్యవసర మీటింగ్ పెట్టిన అడిషనల్ కలెక్టర్
- వారంలో రిపోర్ట్ ఇవ్వాలని హెచ్వోడీలకు ఆర్డర్స్
యాదాద్రి, వెలుగు : ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ సర్కారు వేగం పెంచుతోంది. మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టున్న సర్కారు... సంక్షేమ పథకాలపై ఆధారపడుతోంది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను అర్జంట్‌గా సేకరించాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి జిల్లా ఆఫీసర్లతో అత్యవసర మీటింగ్ఏర్పాటు చేసి శాఖల వారీగా లబ్ధిదారుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. వారంలోనే రిపోర్టులు ఇవ్వాలని సూచించడంతో అన్ని డిపార్ట్‌మెంట్ల హెచ్‌వోడీలు ఆ పనిలో పడ్డారు.
అక్టోబర్‌లో ఫస్ట్ వీక్‌లో ఓటరు జాబితా
అక్టోబర్ మొదటి వారంలో తుది ఓటరు జాబితా విడుదల కానుండడం, ఎన్నికల కమిషన్ రాష్ట్ర పర్యటనకు రానుండడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సర్కారు వేగంగా పావులు కదుపుతోందని సమాచారం. బీఆర్‌ఎస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో మూడోసారి అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలు తప్ప మరోమార్గం లేదని అంచనాకు వచ్చినట్టు ఆ పార్టీ లీడర్లే అంటున్నారు.
దీంతో ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అమలు చేసిన పథకాల కింద లబ్ధిపొందిన వారి వివరాలను సేకరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందులోభాగంగా తొమ్మిదేండ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు, ఫోన్ నెంబర్లతో సహా సేకరించాలని ఇంటర్నల్ ఆర్డర్స్ జారీ చేసింది.
యాదాద్రిలో స్కీమ్స్ వారీగా లబ్ధిదారులు
తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత యాదాద్రి జిల్లాలో పలు స్కీమ్స్‌ను అమలు చేసింది. 4, 26, 177 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత కరెంట్, 1.18 లక్షల మందికి రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తోంది. ఆసరా కింద 1,03, 984 మందికి లబ్ధి చేకూరుతోంది. 21, 618 మందికి కేసీఆర్ కిట్, కంటి వెలుగు కింద 91, 758 మందికి అద్దాలు, ఆరోగ్యశ్రీ ద్వారా 12, 330 మందికి ఆపరేషన్లు, డబుల్ బెడ్రూం స్కీమ్‌లో 3, 464 ఇండ్లు మంజూరు కాగా 1158 ఇండ్లు పూర్తి చేసి 769 మందికి ఇండ్లు కేటాయించారు. 18, 655 మంది కాపరులకు గొర్రెల పంపిణీ చేశారు.
చేప పిల్లల విడుదలతో 8,929 మందికి ఉపాధి కల్పించడంతోపాటు 6, 896 మందికి పాడి పశువుల పంపిణీ చేశారు. నేతన్న కు చేయూతలో 11, 888 మందికి, చేనేత మిత్ర ద్వారా 11, 220 మందికి లబ్ధి, చేనేత బీమాలో 9, 743 మందికి లబ్ధి జరిగింది. 3,763 రజకులు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు, 1794 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అందుతోంది. కేసీఆర్ తోఫా ద్వారా మైనార్టీ మహిళలకు 330 కుట్టు మిషన్లు అందించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ స్కీమ్ కింద వేల మంది లబ్ధిపొందారు. వీటితో పాటు ప్రభుత్వం గృహలక్ష్మి, దళితబంధు, మైనార్టీబంధు, బీసీబంధు అమలు చేస్తోంది.
ప్రగతి నివేదికలు
తెలంగాణ దశాబ్ది వేడుకల సమయంలో నియోజకవర్గాల వారీగా ప్రగతి నివేదికలను ఆఫీసర్లు రూపొందించారు. వీటిల్లో ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య, ఖర్చు చేసిన మొత్తం ఎంతో పేర్కొన్నారు. ఈ నివేదికలో ఏప్రిల్ వరకే లబ్దిదారుల సంఖ్య, ఖర్చు చేసిన మొత్తం వెల్లడించారు. ఆ తర్వాతే బీసీ, మైనార్టీ బంధుతో పాటు గృహలక్ష్మి స్కీమ్స్‌ను అమలు ప్రకటించింది.
గృహలక్ష్మి స్కీమ్‌లో 8400 మంది, లబ్దిదారుల ఎంపిక కూడా జరిగింది. ఇప్పుడు రుణమాఫీ ప్రక్రియ సాగుతోంది. అదే విధంగా దళితబంధు మొదటి విడతలో 431 మందికి ఇవ్వగా రెండో విడతలో నియోజకవర్గానికి 1100 మందిని ఎంపిక చేయడానికి కసరత్తు నడుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు జాబితాలను రూపొందించి ఆఫీసర్లకు అందించారు.