- బీసీల్లోని చాలా కులాలపట్ల బీఆర్ఎస్ చిన్నచూపు చూస్తోంది
- బుడబుక్కల కులానికి ఎంపీ అర్వింద్ క్షమాపణ
నిజామాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం చేస్తున్న పాలిటిక్స్ ఆ వర్గాన్ని తీవ్రంగా నష్టపరుస్తుందని ఎంపీ అర్వింద్ అన్నారు. ఎంఐఎంతో ఆ పార్టీ దోస్తానా మరింత చేటు చేస్తుందన్నారు. మంగళవారం ఆయన నగరంలోని ఉర్దూ మీడియా కోసం ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఇటీవల ఆయన మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి 'బుడబుక్కల' అనే పేరును సంబోధిస్తూ విమర్శించారు. బుడబుక్కల అనేది కులం పేరని తనకు నిజంగా తెలియదని తన మాటలతో ఆ సామాజిక వర్గానికి చెందిన కులస్థులు బాధపడి ఉంటే అందుకు క్షమాపణ చెబుతున్నానని స్పష్టతనిచ్చారు. బుడబుక్కల, తోలుబొమ్మల తదితర కులాల వాళ్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి తన వద్దకు వచ్చారని అన్నారు. ఆయా కులాల కుల ధ్రువీకరణ పత్రాలు ఆలస్యంగా వస్తున్నాయని బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు వివరించారు. సంచార జాతులకు చెందిన బీసీ కులస్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, అన్ని సంక్షేమ పథకాలు వారికి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయులన్నారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న ఆవాస్ యోజనతో బీజేపీయేతర గవర్నమెంటు ఉన్న రాష్ట్రాలు లాభపడ్డాయని లబ్ధిదారులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం నేరుగా అందుతుందన్నారు. ఇండ్లను మహిళల పేరున రిజిస్ట్రర్ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ డబుల్రూమ్ ఇండ్లు ఇవ్వక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల సహాయం పొందే వీలుందన్నారు. ముద్రలోన్తో ముస్లిం మైనారిటీలకు మేలు కలిగిందన్నారు. యూపీలో మైనారిటీ ఓట్ల శాతం ఎక్కువ ఉన్న నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు గెలిచారన్నారు. యూసీసీని సరిగా అర్థం చేసుకోక వ్యతిరేకత పెంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో దళితబంధుకు రూ.10 లక్షలు, మైనారిటీ బంధుకు రూ.లక్ష ఏమిటన్నారు. స్టేట్‌లో ఈ రెండు సామాజికవర్గాల జనాభా దాదాపు సమానంగా ఉండగా రాజకీయాలు చేస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ తిరస్కరిస్తున్న కేంద్ర సర్కారు పథకాలు స్టేట్‌లో అమలుకావాలంటే మైనారిటీలతో సహా అన్ని వర్గాల వారు బీజేపీ వైపు రావాలన్నారు. బీజేపీ వద్దనుకునే మైనారిటీలు నోటాకు ఓటు వేయాలన్నారు. బీఆర్ఎస్కు వేసి భవిష్యత్తు పాడు చేసుకోవద్దన్నారు. కాంగ్రెస్ అసలు పోటీలో లేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వాలక్షీనర్సయ్య, ధన్‌పాల్‌సూర్యనారాయణ గుప్తా, స్రవంతిరెడ్డి తదితరులు ఉన్నారు.