బీఆర్ఎస్.. జనతా గ్యారేజ్​లా పనిచేస్తుంది

బీఆర్ఎస్.. జనతా గ్యారేజ్​లా పనిచేస్తుంది
  • ప్రజలకు ఏ కష్టమొచ్చినా తెలంగాణ భవన్ కే వస్తున్నరు: కేటీఆర్

హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు: రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వైపే వస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ లా పని చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ నేతలతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన 27 మందికి నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తరువాత మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.

 కేసీఆర్​ మాట వింటే ధైర్యం వస్తుందని, అన్ని నియోజకవర్గాల ప్రజలు సభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం దాదాపు 1,250 ఎకరాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వెయ్యి ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించామన్నారు. 10 లక్షల వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, 100కు పైగా వైద్య బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.