
- తమ ఖాతాలో వేసుకునే పనిలో బీఆర్‍ఎస్ లీడర్లు.
- గతంలో మూడుసార్లు తరలివెళ్లిన కోచ్, వ్యాగన్ ఫ్యాక్టరీలు
- అనూహ్యరీతిలో వ్యాగన్ల తయారీ యూనిట్ ఇచ్చిన కేంద్రం
- పీఓహెచ్‍తో పాటు మరో ప్రాజెక్ట్ మంజూరు చేసిన ప్రధాని
వరంగల్, వెలుగు : దశాబ్దాలుగా కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడానికి మీరంటే.. మీరంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇన్నాళ్లు విమర్శలు చేసుకోగా.. కొద్దిరోజులుగా రూట్ మార్చాయి. కేంద్రం కోచ్ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్ మ్యానిఫ్యాక్చర్ యూనిట్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ క్రెడిట్ తమదంటే.. తమదంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. గతంలో కాజీపేటకు రావాల్సిన ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు తరలించారని కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం వ్యాగన్ ఫ్యాక్టరీ రావడానికి కేంద్రంలోని తమ ప్రభుత్వమే కారణమని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక తమ పోరాటాలతోనే కేంద్రం వ్యాగన్ యూనిట్ మంజూరు చేసిందని అధికార బీఆర్‍ఎస్ లీడర్లు అంటున్నారు. ఇలా ఎవరికి వారు ప్రచారంలో నిమగ్నమయ్యారు.
మూడుసార్లు పక్క రాష్ట్రాలకే..
దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట జంక్షన్ చాలా కీలకమైంది. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే సెంటర్ పాయింట్‍గా ఉంది. ఇక్కడి ప్రజల చిరకాల కోరికైన కోచ్ ఫ్యాక్టరీ దశాబ్దాలుగా కలగానే మిగిలింది. ప్రధాని ఇందిరాగాంధీ పాలన కాలంలో హన్మకొండ ఎంపీగా పీవీ నరసింహారావు ఉన్నప్పుడు 1982–-83లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం మొదటిసారిగా ప్రస్తుత కడిపికొండ వద్ద 1500 ఎకరాల భూసేకరణకు సర్వే చేశారు. ఇది జరిగే క్రమంలో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ప్రధానిగా వచ్చిన రాజీవ్‍గాంధీ పంజాబ్ అల్లర్లు, తీవ్రవాదాన్ని సాకుగా చూపి కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‍లోని కపుర్తలా తరలించుకుపోయారు. రెండోసారి 2007లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఓకే అయ్యే క్రమంలో మళ్లీ చేజారింది. సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‍బరేలికి తీసుకెళ్లారు.
మూడోసారి 2010–-11లో యూపీఏ –-2 పాలనలో రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ మళ్లీ కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రకటించారు. రైల్వే బడ్జెట్‍లో రూ.15 కోట్లు కేటాయించారు. భూసేకరణలో రాష్ట్ర సర్కారు, లోకల్లీడర్ల నిర్లక్ష్యంతో అదికాస్త కర్ణాటకకు తరలిపోయింది. ఇలా కాజీపేటకు రావాల్సిన కోచ్, వ్యాగన్ ప్రాజెక్టులు ఇతర,రాష్ట్రాలకు మళ్లాయి.
ప్రచార అస్త్రంగా మారి..
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిపోయింది. అధికార.. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కేంద్రమైంది. కోచ్ ఫ్యాక్టరీపై దాదాపు 40 ఏండ్లుగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఎందుకివ్వడం లేదని కాంగ్రెస్, బీఆర్‍ఎస్ విమర్శిస్తున్నాయి. మరోవైపు కాజీపేటకు ఎంతో కొంత న్యాయం చేయాలనే పీఓహెచ్, ఫండ్స్ మంజూరు చేశామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.
ప్రధాని సర్‍ఫ్రైజ్ గిఫ్ట్
ఓ వైపు కోచ్ ఫ్యాక్టరీ పంచాయితీ.. మరోవైపు పీఓహెచ్ వర్క్ షాప్ ఏర్పాటు స్థలంపైనా అధికార, విపక్షాల మధ్య రాజకీయ విమర్శలు తీవ్రంగా నడుస్తున్నాయి. పీఓహెచ్ ఏర్పాటుకు 99 శాతం భూములను కేంద్రానికి రాష్ట్ర సర్కారు ఇచ్చింది. దానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని బీజేపీ నేతలు ప్రకటించారు. కాగా.. ఓరుగల్లు వాసులకు ప్రధాని మోడీ కూడా సర్‍ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పీఓహెచ్‍కు అదనంగా ఇక్కడే నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేస్తూ.. అఫిషియల్ జీఓలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో కోచ్ ఫ్యాక్టరీ కొట్లాటకు కొంతవరకు ఫుల్‍స్టాప్ పడ్డట్లైంది. అయితే... కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఉన్నప్పటికీ.. వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు అధికార పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్‍ఎస్ చేయలేని పనిని తమ ప్రభుత్వం చేసిందని బీజేపీ లీడర్లు చెప్పుకుంటున్నారు. తాము చేపట్టిన నిరసనలతోనే వచ్చిందని ప్రతిపక్షపార్టీల నేతలు అంటున్నారు. మొత్తంగా ఈనెల 8న ప్రధాని మోడీ హాజరై వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
రాష్ట్ర సర్కారు జాప్యంతో..
ఇలా కాజీపేటకు అన్యాయం జరిగిన నేపథ్యంలో 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత ఇచ్చింది. కొత్త కోచ్ ఫ్యాక్టరీలు అందుబాటులో లేకపోగా, అందుకు బదులుగా ఐదారు వేలమందికి ఉపాధి కల్పించే పిరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) వర్క్ షాప్ ను మంజూరు చేసింది. 2016------17లో నెలకు 200 వ్యాగన్లకు రిపేర్లు చేసే ప్రాజెక్ట్ కు రూ.188 కోట్లు కేటాయించింది. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో రూ.10 కోట్ల చొప్పున రెండుసార్లు నిధులు ఇచ్చింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం 155.5 ఎకరాల స్థల సేకరణలో జాప్యం చేయడంతో నిలిచిపోయింది.