బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు!..రెండు వారాల్లో ప్రకటన

మరో రెండు వారాల్లో ప్రకటన 

  • దాదాపు 80 స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఫైనల్ 
  • ఆషాఢమాసం ముగియగానే అనౌన్స్​మెంట్ 
  • పోటీ ఉన్న మిగతా నియోజకవర్గాల్లో విడతల వారీగా ఎంపిక
  • ప్రతిపక్షాల కంటే ముందే ప్రచారంలోకి అధికార పార్టీ 

హైదరాబాద్, వెలుగు :a ఆషాఢమాసం ముగిసిన వెంటనే అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్ ​ప్రకటిస్తారని బీఆర్ఎస్​ ముఖ్య నేతలు చెబుతున్నారు. దీన్ని మంత్రి కేటీఆర్​ కూడా ధ్రువీకరించారని అంటున్నారు. ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది లీడర్లు పోటీ పడుతున్న మిగతా నియోజకవర్గాల్లో విడతల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తారని పేర్కొంటున్నారు. ఈసారి ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్​ గతంలోనే చెప్పారు. దానికి తగ్గట్టుగా కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీశ్​రావు, కవిత వేర్వేరు సభల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులెవరో చెప్పేశారు. కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్​ రెండో వారంలో వస్తుందని, నవంబర్​ నెలాఖరుకు పోలింగ్​ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఈ లెక్కన ఎన్నికలకు ఇంకో నాలుగున్నర నెలలు మాత్రమే ఉండడంతో ప్రతిపక్షాల కంటే ముందే ప్రచారం మొదలు పెట్టాలని అధికార పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లు, ఇతర అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మం త్రులు కేటీఆర్, హరీశ్​రావు సైతం జిల్లాల్లో పలు కార్యక్రమాల పేరుతో ప్రచారం షురూ చేశారు. 

ఖరారైన క్యాండిడేట్లు వీళ్లే.. 

కేసీఆర్​ఇటీవల పటాన్​చెరు నియోజకవర్గంలో పర్యటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్​ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్​అధికారికంగా ప్రకటించిన క్యాండిడేట్​ఈయన ఒక్కరే. అయితే మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత కొంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కేటీఆర్, హరీశ్​రావు​తమ జిల్లా పర్యటనల్లో గంగుల కమలాకర్​(కరీంనగర్), మాధవరం కృష్ణారావు (కూకట్​పల్లి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), ఆరూరి రమేశ్​(వర్ధన్నపేట), నల్లమోతు భాస్కర్​రావు (మిర్యాలగూడ), ధాస్యం వినయ్​భాస్కర్​(వరంగల్​వెస్ట్), గాదరి కిశోర్ (తుంగతుర్తి), గువ్వల బాలరాజు (అచ్చంపేట), ఆల వెంకటేశ్వర్​రెడ్డి (దేవరకద్ర), 

వి.శ్రీనివాస్​గౌడ్​(మహబూబ్​నగర్), మంచిరెడ్డి కిషన్​రెడ్డి (ఇబ్రహీంపట్నం), సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), చంటి క్రాంతికిరణ్​(ఆందోల్), మర్రి జనార్దన్​రెడ్డి (నాగర్​కర్నూల్), బండ్ల కృష్ణమోహన్​రెడ్డి (గద్వాల) పేర్లు ప్రకటించారు. హుజూరాబాద్​లో పోటీ చేయబోయేది ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డినే అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కరీంనగర్​ఎంపీ అభ్యర్థిగా ప్లానింగ్​బోర్డు వైస్​చైర్మన్​వినోద్​కుమార్​పేరు ఖరారు చేశారు. ఇక కవిత ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలో ఆశన్నగారి జీవన్​రెడ్డి (ఆర్మూరు), బిగాల గణేశ్​గుప్తా (నిజామాబాద్​అర్బన్), షకీల్​అహ్మద్​(బోధన్), జాజల సురేందర్​(ఎల్లారెడ్డి) పేర్లు ప్రకటించారు.  

ALSO READ:ఇంజినీరింగ్ సీట్లు.. మరో 14 వేలు

దాదాపు 40 సీట్లలో టికెట్లకు పోటీ.. 

కేసీఆర్ సహా ముఖ్య నేతల జిల్లా పర్యటనల్లో ఆసిఫాబాద్, వరంగల్​తూర్పు, కొత్తగూడెం, బెల్లంపల్లి, మంచిర్యాల సహా ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఎత్తలేదు. దాదాపు 40 నియోజకవర్గాల్లో టికెట్ల కోసం గులాబీ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల షెడ్యూల్​వచ్చే నాటికి క్యాండిడేట్లను ఖరారు చేయాలని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తున్నది. ఎంపీలు కొత్త ప్రభాకర్​రెడ్డి, రంజిత్​రెడ్డి, మాలోతు కవిత అసెంబ్లీకి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కొత్త ప్రభాకర్​రెడ్డికి దుబ్బాక సీటు దాదాపు ఖరారైందని తెలిసింది. కొందరు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల​చైర్మన్లు, ఇతర నాయకులు కూడా తమకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వారిలో ఎవరిని బరిలోకి దించితే పార్టీ విజయం సాధించే అవకాశం ఉందో సర్వేల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. 

సర్వేల్లో ప్రజల మద్దతు ఉన్న నేతల వైపే కేసీఆర్​మొగ్గు చూపే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. టికెట్ల కేటాయింపులో లాబీయింగ్​కన్నా సర్వే ఫలితాలే ప్రామాణికమని అంటున్నారు. ఇప్పటికే పలు సర్వే ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్​ఇచ్చిన రిపోర్టులను ప్రగతి భవన్​కేంద్రంగా పనిచేసే కోర్​టీమ్ వడపోస్తున్నదని.. దాదాపు 70 నుంచి 80 మంది అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని పేర్కొంటున్నారు. ‘‘ఆషాడ మాసం తర్వాత అధిక శ్రావణమాసం ప్రారంభమవుతుంది. నిజ శ్రావణం కోసం ఇంకో నెల రోజులు వేచి చూడాల్సి ఉండడంతో అధిక శ్రావణంలోనే మంచి రోజు చూసుకుని అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు” అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.