పచ్చని పొలాల్లో ఫార్మాసిటీనా .. ఎన్జీటీ, హైకోర్టులో కేసు వేస్తం: హరీశ్

పచ్చని పొలాల్లో  ఫార్మాసిటీనా .. ఎన్జీటీ, హైకోర్టులో కేసు వేస్తం: హరీశ్

సంగారెడ్డి/న్యాల్కల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయి ఇప్పుడు జహీరాబాద్ ప్రాంత రైతుల నెత్తిన పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను గురువారం బీఆర్ఎస్ నేతలు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ..‘‘కేసీఆర్ హయాంలో హైదరాబాద్ సమీపంలో జీరో వ్యర్థాలతో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 15 వేల ఎకరాలు కేటాయించారు. 

దానికి పర్యావరణ, అటవీ తదితర అన్ని అనుమతులు వచ్చాయి. కానీ, దాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చారు. హైదరాబాద్​లో కాదని సంగారెడ్డి జిల్లాలో పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నారు?” అని ఫైర్ అయ్యారు. దీనిపై అవసరమైతే ఎన్జీటీ, హైకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. ఫార్మాసిటీకి కేసీఆర్ హయాంలో కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు.