- సీఎంకు మూడు వారాలుగా వైరల్ ఫీవర్
- టికెట్ల ప్రకటన తర్వాత కనిపించని గులాబీ బాస్
- బీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసనలు, నిలదీతలు
- దళితబంధుపై గ్రామాల్లో రాజుకున్న అగ్గి
- స్థానికంగా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలపైనా నిలదీస్తున్న జనం
- కేసీఆర్ ఒక్క సభ పెడితే సీన్ మారుతుందని పార్టీ నేతల భరోసా
హైదరాబాద్: గులాబీ సైన్యం సీఎం కేసీఆర్ నే నమ్ముకుంది. ఒక్క సారి ఆయన బయటికి వస్తే సీన్ మారిపోతుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది. పల్లెల్లో ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. స్థానిక హామీలను అమలు చేయలేదంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని నిలదీస్తున్నారు. ఇవాళ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇలాకాలో దీనిపై ఆందోళనలు జరిగాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో దళితులు సర్పంచ్ ఇంటికి తాళం వేసి నిరసన తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డి చిత్రపటాన్ని తొక్కుతూ నిరసన తెలుపడం గమనార్హం. ధర్మపురి సెగ్మెంట్ పరిధిలోని నేరెళ్ల, దమ్మన్నపేట, రామయ్యపల్లె, జగదేవ్ పేట గ్రామాల్లో అనర్హులకు దళిత బంధు కేటాయించారని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యాలయాలను ముట్టడించారు. నిర్మల్ జిల్లా ముథోల్ లోనూ దళితబంధు సెగలు రగులుతున్నాయి. బాసర మండలం కిర్గుల్ (కే) గ్రామంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని దళితులు నిలదీయగా స్థానిక సర్పంచ్ వారిపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సెగ్మెంట్లో పల్సి మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం డిమాండ్ చేస్తున్న స్థానికులు ఇవాళ అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ నినదించారు. పట్టణం నుంచి తరిమేశారు. చాలా సెగ్మెంట్లలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డినీ పాలకీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో దళితులు అడ్డుకొన్నారు. అనర్హులకే ఇస్తున్నారంటూ నిలదీశారు. హుజూరాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం తెరమీదకు వచ్చింది. ఇందుకోసం ఆందోళనలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ పలుచోట్ల మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. పంపిణీకి వచ్చిన లీడర్లను నిలదీస్తున్నారు.
ALSO READ : ట్రబుల్ షూటర్గా జానారెడ్డి.. అసంతృప్తులను బుజ్జగించే టాస్క్
వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ను ఐనవోలు మండలం కొండపర్తిలో స్థానికులు అడ్డుకున్నారు. గ్రామాభివృద్ధిని పట్టించుకోని ఎమ్మెల్యేకు ఎన్నికలప్పుడే గుర్తొస్తామా? అంటూ నిలదీశారు. ఇలా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు రకరకాల నిరసనలను ఎదుర్కొంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల బడి పిల్లలలకు అల్పాహార పథకాన్ని కేటీఆర్ ప్రారంభించారు. కొత్త హామీల జోలికి వెళ్లకపోవడం, మ్యానిఫెస్టో అంశాలను ప్రస్తావించకపోవడం గమనార్హం.
పులి ఎంట్రీ ఇస్తే సీన్ మారుతుందా..?
‘ త్వరలో పులి వస్తది.. సీన్ మారిపోతుంది’ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు మూడు వారాలుగా జ్వరంతో బాధపడుతున్న కేసీర్ ఇటీవలే కోలుకున్నారు. ఛాతీలో ఇన్ ఫెక్షన్ కారణంగా ఆయన బయటికి రావడం లేదని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన విమర్శలపైనా కేసీఆర్ స్పందించలేదు. అంతలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ కు ముందు ఏదైనా అబ్బుర పర్చే పథకం అనౌన్స్ చేస్తారని భావించిన గులాబీ లీడర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఈ నెల 15న బీఫారాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్.. ఆ రోజే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఆ సభలో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు ఆశిస్తున్నాయి. నిరసనలు, నిలదీతలకు చెక్ పెట్టేందుకు తమ బాస్ వద్ద భారీ వ్యూహమే ఉందన్న చర్చను కారు పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయనొస్తే అంతా సెట్ రైట్ అయిపోతుందన్న ధీమాతో ఉన్నారు.