పెద్దపల్లి జిల్లాలో బీఆర్​ఎస్ క్యాడర్​​ చెల్లాచెదురు .. ఎన్నికలు ముగిసినా ఆగని వలసలు

  • పంచాయతీ, పార్లమెంట్​ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్​
  • నియోజకవర్గ ఇన్​చార్జిలను మార్చే ఆలోచనలో బీఆర్​ఎస్​ హైకమాండ్​

పెద్దపల్లి, వెలుగు: బీఆర్​ఎస్​   ఓటమి తర్వాత ఆ పార్టీ ప్రజాప్రతినిధులు,    కార్యక్తలు కాంగ్రెస్​ పార్టీలోకి  క్యూకడుతున్నారు.  ఒకపక్క ఆ పార్టీ ఖాళీ అవుతున్నా  బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం గులాబీ కార్యకర్తలు ఆరోనిస్తున్నారు.  దీంతో స్థానికంగా పార్టీని బలోపేతం చేసేందుకు హైకమాండ్​  ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  

కొత్త ఇంచార్జిల కోసం వెతుకులాట

పెద్దపల్లి జిల్లాకు చెందిన మూడు నియోజకవర్గాల్లో ఇన్​చార్జిలను  మార్చేందుకు బీఆర్​ఎస్​ రెడీ అయింది.  పెద్దపల్లి నుంచి  ఓటమి పాలైన దాసరి మనోహర్​రెడ్డితో పాటు మంథని, రామగుండం ఇన్​చార్జులు  కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఏ నాయకుడిని, కార్యకర్తను కలువడం లేదని, ఆ పార్టీకి చెందిన సెకండ్​ క్యాడర్​ చెప్తున్నారు. అలాగే పెద్దపల్లి మున్సిపల్ బీఆర్​ఎస్​  కౌన్సిలర్లు ఎన్నికల ముందు  కొంత మంది కాంగ్రెస్​ లో  చేరారు. ఎన్నికల తర్వాత కూడా ఆ చేరికలు ఆగలేదు. పార్టీ మారుతున్న వారిని కూడా మాజీ ఎమ్మెల్యే ఆపే ప్రయత్నం చేయడం లేదని చర్చ మొదలైంది.

దీంతో పార్టీకి చెందిన పలువురు నాయకులు ఈ విషయాన్ని కేటీఆర్​ దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను దీటుగా ఎదుర్కోవాలంటే సరైన నాయకులు అవసరమని కేటీఆర్​ భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నాయకులకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్​ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పెద్దపల్లి బీఆర్​ఎస్​ ఇన్​చార్జిగా  తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న మాజీ టిఎస్​టిఎస్​ చైర్మన్​ చిరుమల్ల రాకేశ్​  కుమార్​, లేదా బొద్దుల లక్ష్మన్​, నల్ల మనోహర్​రెడ్డి పేర్లను  పరిశీలిస్తున్నట్టi  తెలుస్తోంది. అలాగే రామగుండం, మంథనిలో కూడా నియోజకవర్గ ఇంచార్జీలను మార్చడానికి బీఆర్​ఎస్​ హైకమాండ్​ కసరత్తు చేస్తున్నట్లు బీఆర్​ఎస్​ నాయకుల్లో   చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్​ను ఎదుర్కోవాలంటే....

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్​ పార్టీని ఎదుర్కోవాలంటే నియోజకవర్గాల ఇన్​చార్జులను మార్చాల్సిందేనని బీఆర్ఎస్​ సెకెండ్​ క్యాడర్​ పార్టీ హైకమాండ్​కు రిక్వెస్ట్​ పెట్టుకుంది. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు చెందిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు 2014, 2018లో  ప్రత్యేక పరిస్థితుల్లో గెలిచి ఎమ్మెల్యేలయ్యారు.  ఆనాటి పరిస్థితులు వారికి అనుకూలించడంతో పెద్దపల్లి నుంచి గెలిచిన దాసరి రెండు టర్మ్​లు, మంథని, రామగుండం నుంచి ఒక్కో టర్మ్​ ఎమ్మెల్యేలుగా చందర్​, పుట్ట మధు  ఉన్నారు.

 రెండు టర్మ్​లు బీఆర్​ఎస్​కు అవకాశం ఇచ్చిన ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్​ బలమైన శక్తిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకు దీటుగా ప్రజల పక్షాన పోరాడాలంటే బీఆర్​ఎస్​ నుంచి ఓడిపోయిన వారితో కాదు అనే సంకేతాలను బీఆర్​ఎస్​ నాయకులు కేటీఆర్​ దృష్టికి తీసుకపోయినట్లు సమాచారం. ఎన్నికలు మొదలైన నాటి నుంచి స్టార్ట్ అయిన వలసలు ఇంకా కొనసాగుతుండటంతో క్యాడర్​ ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ నియోజకవర్గాల ఇన్​చార్జీలను  మార్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.   తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన యువ నాయకులకే ఇన్​చార్జీల బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో కేటీఆర్​ ఉన్నట్లు జిల్లాకు చెందిన పలువురు బీఆర్​ఎస్​ నాయకులు చర్చించుకుంటున్నారు. క్యాడర్​లో ఉత్సాహాన్ని నింపి రోడ్ల మీదకు వచ్చి సమస్యలపై పోరాటం చేయగల సత్తా ఉన్న నాయకులనే తెరమీదికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో బీఆర్​ఎస్​ లో  ఎలాంటి మార్పులు  చోటుచేసుకుంటాయో చూడాల్సి ఉంది.