ఓరుగల్లులో..ఖాళీ అవుతున్న కారు

  •     ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు 
  •     కిందిస్థాయి నుంచి పైవరకు  అందరిదీ అదే తీరు 
  •     బెడిసికొడుతున్న అధిష్టానం బుజ్జగింపులు
  •      ఎంపీ ఎన్నికలకు ముందే బీఆర్​ఎస్​ దెబ్బ 

హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు    ఖాళీ అవుతోంది. జిల్లాలో కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గులాబీ గూటిన వదిలేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్​ వరంగల్ పరిధిలోని కార్పొరేటర్లు చాలామంది కాంగ్రెస్​ లో  చేరారు.   మేయర్​ వెయిటింగ్​ లిస్ట్​ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇన్నిరోజులు పార్టీలో  తగిన గుర్తింపు లేదంటూ..  సీనియర్​ నాయకులు కూడా కారు దిగిపోతున్నారు.  కీలక నేతలు పార్టీ వీడటంతో గ్రామ స్థాయిలో కూడా వారి అనుచరులు కాంగ్రెస్​లో చేరుతున్నారు.

 ఎవరైనా ఇతర పార్టీల్లోకి వెళ్తున్నట్టు సమాచారం అందగానే వెంటనే  నియోజకవర్గాల్లోని  కొందరు లీడర్లు హైకమాండ్​ ఆదేశాలతో  రంగంలోకి దింపి,  బుజ్జగించే పనిలో పెడుతున్నారు. పార్టీని వీడొద్దంటూ ఏదోరకంగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారు  బీఆర్​ఎస్​లో కొనసాగడానికి ఇష్టపడటం లేదు. 

కాంగ్రెస్​లోకి క్యూ.. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12  స్థానాల్లో 10 సీట్లు కాంగ్రెస్​ కైవసం చేసుకోగా.. బీఆర్​ఎస్​ రెండు స్థానాలకు పరిమితమైంది.  బీఆర్​ఎస్​ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలో తమకు గుర్తింపు లేదని భావిస్తున నేతలు  కాంగ్రెస్​  లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఫిబ్రవరి 3న స్టేషన్​ ఘన్​ పూర్​ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్​ఎస్​ పార్టీకి గుడ్​ బై చెప్పారు. ఆ తరువాత వెంటనే కాంగ్రెస్​ లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ఐదు రోజుల కిందట గ్రేటర్​ వరంగల్

మేయర్​ గుండు సుధారాణి కూడా హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమైనా   అనివార్య కారణాల ఇంతవరకు వారిద్దరూ  పార్టీలో చేరలేదు. ఇదిలాఉంటే తాజాగా ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్​ మార్నేని రవీందర్​ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతితో కలిసి బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేసి, శనివారం కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు గ్రేటర్​ వరంగల్​ కు చెందిన కొంతమంది కార్పొరేటర్లు, ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్​ చైర్మన్లు, కౌన్సిలర్లు, కొందరు ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇప్పటికే కాంగ్రెస్​ లో చేరగా..

మరికొంతమంది అదేబాటలో  ఉన్నారు.  బీఆర్​ఎస్   నుంచి వరంగల్ ఎంపీ టికెట్​ ఆశించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్.. ఆ పార్టీపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో బీజేపీ నుంచి టికెట్​ ప్రయత్నాలు చేశారు. రెండ్రోజుల కిందట మాజీ ఎంపీ సీతారాం నాయక్​ కూడా బీజేపీ వైపు అడుగులు వేశారు. శుక్రవారం  వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వరంగల్​కు వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి నేరుగా సీతారాం నాయక్​ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్​ కూడా బీఆర్​ఎస్​ పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడం

పార్టీ అగ్రనేతల తీరుపై తీవ్రంగానే మండిపడ్డారు. దీంతో ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమనే అంటున్నeరు.  ఇక యువ నాయకుడు, దివంగత మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ తనయుడు, గ్రేటర్​ 60వ డివిజన్​ కార్పొరేటర్​ దాస్యం అభినవ్​ భాస్కర్​.. తన బాబాయ్​ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ తీరుపై అసంతృప్తితో బీఆర్​ఎస్​ ను వీడారు. ఫిబ్రవరి 8న బీజేపీలో చేరి పార్టీ నేతలకు షాక్​ ఇచ్చారు. నియోజకవర్గానికి చెందిన యువ నేత కావడం, అందులోనూ దాస్యం ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో అభినవ్​ భాస్కర్​ బీజేపీలో చేరడం హాట్ టాపిక్​ గా మారింది.

ఫలించని  బుజ్జగింపులు 

జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలోనూ క్యాడర్​ చేజారుతుండటంతో బీఆర్​ఎస్​  హైకమాండ్​ బుజ్జగింపులు చేస్తోంది.   కీలక నేతలెవరైనా పార్టీ మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలియగానే మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రి కేటీఆర్​ వెంటనే జిల్లా, నియోజకవర్గంలోని ముఖ్య నేతలను  బుజ్జగింపులకు పంపుతున్నారు.  తాజాగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. వెంటనే  స్టేషన్ ఘన్​ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు,  ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను రంగంలోకి దించారు.

అరూరిని పార్టీ మారకుండా బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా  ఆయన స్పందించకపోవడంతో చివరకు కేటీఆరే స్వయంగా అరూరిని బుజ్జగించినట్లు తెలిసింది. దీంతోనే తాను పార్టీ మారడం లేదంటూ అరూరి వీడియో రిలీజ్​ చేసినా, అసంతృప్తితోనే ఆయన పార్టీలో కొనసాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మాజీ ఎంపీ సీతారాం నాయక్​ కూడా బీజేపీ చేరుతున్నారన్న సమాచారంతో  మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ రాయబారం నడిపారు.

ఇక డీసీసీబీ చైర్మన్​ మార్నేని రవీందర్​ కాంగ్రెస్​ కండువా కప్పుకునేందుకు హైదరాబాద్ వెళ్లగా.. ఆయనకు సన్నిహితంగా ఉండే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు మంతనాలు జరిపినట్లు సమాచారం. అయన ఎంత నచ్చచెప్పినా పార్టీ నేతల తీరుతో అసంతృప్తి చెందిన మార్నేని కాంగ్రెస్​ లో చేరేందుకు ఫిక్స్​ అయి శనివారం కండువా కప్పుకున్నారు.