మంచిర్యాల మున్సిపాలిటీ హస్తగతం .. చైర్మన్, వైస్ చైర్మన్ లపై నెగ్గిన అవిశ్వాసం

  •  కొత్త చైర్మన్​, వైస్​చైర్మన్​ రేసులో రావుల ఉప్పలయ్య, సల్ల మహేష్ 

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల మున్సిపాలిటీ హస్తగతమైంది. బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆర్డీవో రాములు ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ క్యాంపులో ఉన్న 26 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు నేరుగా సమావేశానికి హాజరయ్యారు.

 ఉదయం చైర్మన్ పెంట రాజయ్యపై, మధ్యాహ్నం వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ పై వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరు కాగా... కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు బీజేపీ కౌన్సిలర్ మోతే సుజాత అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో చైర్మన్ రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ తమ పదవులను కోల్పోయారు. 

మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 22, కాంగ్రెస్ 14 సీట్లను గెలుచుకున్నాయి. అనంతరం కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీఆర్ఎస్ కు చెందిన 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 26కు చేరగా, బీఆర్ఎస్ కు తొమ్మిది మంది మిగిలారు. ఆ పార్టీకి సంఖ్యాబలం లేకపోవడంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమైంది. 

దీంతో అవిశ్వాస తీర్మానానికి ముందే చైర్మన్ రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో యథావిధిగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అవిశ్వాసం ప్రక్రియ చేపట్టారు. కాంగ్రెస్ నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో రావుల ఉప్పలయ్య, సల్ల మహేష్ ఉన్నారు. త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ లను  ఎన్నుకోనున్నారు.