కాంగ్రెస్ ​ఖాతాలో మరో రెండు బల్దియాలు

  • నేరేడుచర్ల, భువనగిరి లో నెగ్గిన అవిశ్వాసాలు

  •  కాంగ్రెస్ చేతికి రానున్న బల్దియాలు

నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్​ఎస్​కు భారీ షాక్​ తగిలింది.  తన చేతిలో ఉన్న రెండు మున్సిపాలిటీలను కోల్పోయింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్​ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇవాళ (  జనవరి 23) ఉదయం నేరేడుచర్ల మున్సిపల్​ చైర్మన్ విజయ బాబుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే  అవిశ్వాసానికి బీఆర్ఎస్ కుచెందిన మున్సిపల్ చైర్మన్  హాజరుకాలేదు.13 మంది కౌన్సిల్ సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసారు.  దీంతో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్,  వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనున్నది. త్వరలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకునే అవకాశం ఉంది.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మన్ లపై కూడా అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. మొత్తం 35 మంది కౌన్సిల్ సభ్యులకు... అవిశ్వాసానికి అనుకూలంగా 31 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. వీరిలో  బీఆర్ఎస్ కు చెందిన 16 మంది  కౌన్సిలర్లు , 9 మంది కాంగ్రెస్  కౌన్సిలర్లు, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్, ఇద్దరూ కౌన్సిలర్లు తీర్మానికి గైర్హాజరయ్యారు.  ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకాకుండానే అవిశ్వాసం నెగ్గింది.  త్వరలో ఛైర్మెన్, వైస్ చైర్మన్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో  నేరేడుచర్ల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద టపాసులు పేలుస్తుండగా అపశృతి చోటుచేసుకుంది.  రవి అనే యువకుడి  చేతిలోనే  బాంబు పేలడంతో అతని చేయి పూర్తిగా చిధ్రమైపోయింది.  చికిత్స కోసం వెంటనే హాస్పిటల్ కు  తరలించారు.