- పష్ప–3 రేంజ్ లో మైలేజ్ వస్తుందని ఆశలు
- నేనే డబ్బులివ్వుమన్నానని కేటీఆర్ స్టేట్మెంట్
- జైలుకు పంపితే ట్రిమ్ అయి వస్తానన్న కేటీఆర్
- అరెస్టయితే అదృష్టవంతుడే అంటున్న గులాబీ లీడర్లు
- ఏసీబీ కేసు నమోదు.. నోటీసులపై ఉత్కంఠ
- ఫార్ములా ఈ రేస్ కేసులో కొత్త కోణం
హైదరాబాద్: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం..కేటీఆర్ పై కేసు.. అరెస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే మీడియాలో మైలేజ్ వస్తుందని, ప్రజల్లో సింపథీ పెరుగుతుందని బీఆర్ఎస్ లీడర్లు గట్టిగా నమ్ముతున్నారని తెలుస్తోంది. అది ఏ స్థాయి అంటే పుష్ప–3 రేంజ్ లో ఉంటుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
కేటీఆర్ కూడా ప్రభుత్వాన్ని కవ్విస్తుండటం గమనార్హం. ఫార్ములా ఈ రేస్ కేసులో తానే డబ్బులు ఇవ్వుమన్నానని మీడియా ముందే ఒప్పుకున్నారు.. ఇస్తే తప్పేంది.. హెచ్ఎండీఏ ఓ స్వయం ప్రతిపత్తి గల సంస్థ.. దానికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదంటూ సుదీర్ఘ వివరణే ఇచ్చారు.
ALSO READ | పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు భాషల ఫార్ములా: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
పనిలో పనిగా.. తనను అరెస్టు చేసి జైలుకు పంపితే యోగా చేసి ట్రిమ్ అయి వస్తానంటూ సెటైర్లు కూడా వేశారు. అదే టైంలో కేసు నమోదు కోసం గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. ఫార్ములా ఈ లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది.
అరెస్టు చేస్తే సీఎం అవుతారా..?
మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు కావాలని కోరుకుంటున్నారనే చర్చ విస్తృతంగానే ఉంది. గతంలో అరెస్టయిన కేసీఆర్, జగన్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరేన్ తదితరులు ముఖ్యమంత్రులయ్యారని, తనకు, బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కేటీఆర్ అరెస్టయితే.. ఆయనంత అదృష్టవంతుడు ఉండరు అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగానే చెప్పేశారు. దీనిని బట్టి గులాబీ పార్టీ ప్రస్తుతం కేటీఆర్ అరెస్టుపై ఏ స్థాయిలో ఆశలు పెట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఎఫ్ఐఆర్ అయ్యిందా..?
ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ చేయాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ఏ1 గా ఉంటారా..? ఏ2గా ఉంటారా..? అసలు కేసు ఎవరి మీద నమోదు చేయాలి.. ప్రధాన ముద్దాయి ఎవరనే అంశంపై ఏసీబీ స్టడీ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం న్యాయ నిపుణులతోనూ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
నమోదు చేయబోయే కేసు ఎట్టి పరిస్థితిలోనూ మిస్ ఫైర్ కావద్దనే తలంపుతోనే డీప్ స్టడీ జరుగుతోందని తెలుస్తోంది. కేటీఆర్ ను ఫిక్స్ చేయాలంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవసరమా..? మౌఖిక ఆదేశాలకు ఉన్న చట్టబద్ధత ఎంత..? అనే అంశాలనూ ఏసీబీ పరిశీలిస్తోంది. అయితే ఒక వేళ కేసు నమోదు చేసినా.. ఇప్పుడే నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా..? లేదా తాత్సారం చేస్తారా..? అన్నది అంతుచిక్కడం లేదు.