నిర్మల్​ జిల్లాలో..బీఆర్ఎస్ కు మరో షాక్

  •     నిర్మల్ ఎంపీపీతోపాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజీనామా
  •     వారి బాటలోనే మున్సిపల్ మాజీ చైర్మన్ కూడా..
  •     రెండ్రోజుల్లో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వెల్లడి 

నిర్మల్, వెలుగు : నిర్మల్​ జిల్లా కేంద్రంలో బీఆర్ ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలైన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ ఆధ్వర్యంలో నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నేరెళ్ల వేణు తదితరులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామాను ఆమోదించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను కోరారు.

ఈ మేరకు కేసీఆర్ కు పంపిన లేఖను వారు మీడియాకు విడుదల చేశారు. రెండ్రోజుల్లో తామంతా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వెల్లడించారు. తమ అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. 

కాంగ్రెస్​లో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు

బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు నల్లూరి పోశెట్టి, తారక వాణి రఘువీర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు నాయకులు, కార్యకర్తలకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

పదేండ్ల కాలంలో కుటుంబ పాలనలో విసిగిపోయిన బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ నాయకులు కొట్టె శేఖర్, అయ్యన్నగారి పోశెట్టి, సభా కలీం తదితరులు పాల్గొన్నారు.