నర్సాపూర్ సెగ్మెంట్ లో అసంతృప్తి సెగలు! .. కాంగ్రెస్​ పార్టీకి చేరువవుతున్న బీఆర్​ఎస్​ నాయకులు

  • మురళీ యాదవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ లీడర్లు

మెదక్/శివ్వంపేట, వెలుగు : ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో  అసంతృప్తి సెగలు రగులుతున్నాయి.  ప్రధాన రాజకీయ పార్టీల తరపున టికెట్ ఆశించి భంగపడ్డ వారు, పార్టీ కోసం కష్టపడ్డా తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనుకునే లీడర్లు పార్టీ మారడంపై దృష్టి పెట్టారు. 

బీజేపీ లీడర్ల నారాజ్..​

బీజేపీ టికెట్ నర్సాపూర్​ మున్సిపల్​ చైర్మన్​, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రగొల్ల మురళీ యాదవ్ కు దక్కింది. దీంతో ఆ పార్టీ టికెట్ ఆశించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ వాల్దాస్​ మల్లేశ్​గౌడ్​, రాష్ట్ర నాయకులు రఘువీరా రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అంతకుముందు తమలో టికెట్​ఎవరికి వచ్చినా కలిసి గెలుపుకోసం పనిచేస్తామని చెప్పిన వారు, టికెట్​ కన్ఫర్మ్​ చేశాక మురళీ యాదవ్​ కు టికెట్ ఎలా ఇస్తారంటూ హైకమాండ్​ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో ఆ ముగ్గురు నాయకులు ఎలాంటి నిర్ణయిం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 

మదన్ రెడ్డి వర్గం ఏం చేస్తుందో..?

నర్సాపూర్​ బీఆర్​ఎస్​ అభ్యర్థిత్వం రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డికి దక్కింది. ఇంత కాలంగా సిట్టింగ్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే టికెట్​ఇవ్వాలంటూ ఆందోళనలు చేసిన ఆయన వర్గీయులు బుధవారం సునీతారెడ్డి బీ ఫామ్ అందుకోవడంతో  వారు ఎలాంటి నిర్ణయిం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. మదన్​ రెడ్డి వెన్నంటి ఉన్న నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీపీలు, నామినేటెడ్​ చైర్మన్లు పార్టీ హైకమాండ్​ నిర్ణయానికి తలొగ్గి సునీతారెడ్డి గెలుపుకోసం కృషి చేస్తారా? లేదా? అనేది ఆసక్తి కరంగా మారింది.  సునీతా లక్ష్మారెడ్డి కి బీఫామ్ ఇవ్వడంతో శివ్వంపేట మండలానికి చెందిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి వర్గీయులైన బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు, నాయకులు  కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డితో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది.

‘కారు’ దిగనున్న చిలుముల ఫ్యామిలీ

దివంగత టీఆర్​ఎస్​ సీనియర్​ నాయకుడు చిలుముల కిషన్​ రెడ్డి కుటుంబం పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, గుర్తింపు లేకుండా పోయిందని తీవ్ర అసంతృప్తితో ఉంది. కిషన్​ రెడ్డి కొడుకు చిలుముల శేషసాయిరెడ్డి ఇదివరకే చిలప్​చెడ్​ జట్పీటీసీ పదవికి, బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. తగిన ప్రాధాన్యత ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పినా అది అమలు కాలేదని అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేసిన  కిషన్​రెడ్డి భార్య సుహాసిని రెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ALS0 READ: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పితృ వియోగం.. డీజీపీ అంజనీకుమార్ సంతాపం 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి,అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్​ వారి ఇంటికి వెళ్లి సుహాసిని రెడ్డి, శేషసాయిరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వారు ‘కారు’ దిగి ‘చెయ్యి’ అందుకునేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.