- పోటీపై ఇప్పటికీ నోరు విప్పని పార్టీ పెద్దలు
- సారు డిసైడ్ చేస్తారంటున్నా.. అక్కడి నుంచి రాని క్లారిటీ
- టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావహులు
- రవీంద్ర సింగ్, దేవీ ప్రసాద్, రాజారాం యాదవ్, శశిధర్ రెడ్డి యాక్టివ్
- పార్టీ తీరుతో ఆశావహుల్లో నిరాశ
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలకు నగారా మోగినా ఇప్పటివరకూ పార్టీలో ఎలాంటి చప్పుడు లేకపోవడంతో.. ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే పలువురు ఆశావహులు తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతున్నా.. పార్టీ అధిష్టానం ఇప్పటికీ మౌనం వహిస్తున్నది. ఎన్నికల అంశాన్ని కేసీఆర్ చూసుకుంటారని కేటీఆర్ చెబుతున్నా.. ఎన్నికల్లో పోటీ చేసేది లేనిది క్లారిటీ ఇవ్వడం లేదు. నిజామాబాద్ –కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు నిజమాబాద్–కరీంనగర్–మెదక్ టీచర్ ఎమ్మెల్సీ, నల్గొండ–ఖమ్మం–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 7న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, బీఆర్‌ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరుగుతున్నది.
కరీంనగర్ మాజీ మేయర్ రవీంద్ర సింగ్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి వంటి నేతలు నిజామాబాద్–కరీంనగర్ –మెదక్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం యాక్టివ్‌గా ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ తరఫున అభ్యర్థిని బరిలో దింపుతారా.. లేదా ఇతర అభ్యర్థులకు మద్దతునిస్తారా అన్న దానిపైనా పార్టీ నుంచి క్లారిటీ రాలేదు.
ఓడిపోతామనే అనుమానంతోనేనా..
కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్నింటా విఫలమైందని చెబుతున్న బీఆర్‌ఎస్ నేతలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతామని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ప్రతి మీటింగ్‌లోనూ అంటున్నారు. కానీ, మరో 20 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలున్నా.. పోటీపై మాత్రం పెదవి విప్పడం లేదు. నిజంగానే పార్టీకి పతార పెరిగే ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఎందుకు మాట్లాడడం లేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.
ఇప్పుడే ఏదో ఒకటి తేల్చేస్తే గ్రౌండ్‌లో పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుందని కేడర్ , సన్నిహితులు వద్ద ఆశావహులు వాపోతున్నట్టు చెబుతున్నారు. ఓడిపోతామనే డౌటుతోనే ఎన్నికలకు దూరంగా ఉంటున్నారా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతున్నది. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనపై చాలా వరకు టీచర్లు, ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. అది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై ప్రభావాన్ని చూపించిందన్న చర్చ జరిగింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అలాగే జరిగే అవకాశం ఉందన్న భావనతోనే ఇప్పటికీ ఎన్నికలపై పార్టీ మాట్లాడడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడూ భంగపాటే..
వాస్తవానికి 2019లో ఇవే స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు. అప్పడు ఆ పార్టీ అధికారంలో ఉన్నా కూడా.. ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారు. నిజామాబాద్–కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో గతంలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేయగా.. మాజీ ఆర్టీఏ అధికారి మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది.
ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థికి కేవలం 17,268 ఓట్లు పోలవగా.. 39,430 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నిజామాబాద్–కరీంనగర్–మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిల్ మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి పోటీ చేయగా.. నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లు కేవలం 2,486 ఓట్లే. ఆ ఎన్నికల్లో పీఆర్‌టీయూ నేత రఘోత్తం రెడ్డి విజయం సాధించారు. వరంగల్–నల్గొండ –ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి పూల రవీందర్.. యూటీఎఫ్ మాజీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి చేతిలో ఓడిపోయారు. రవీందర్‌కు ఆ ఎన్నికల్లో కేవలం 6,279 ఓట్లు పోలయ్యాయి.