మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకాలో అధికార పార్టీ సర్పంచ్ రాజీనామా

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకాలో అధికార పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ సర్పంచ్..తన పదవికి రాజీనామా చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్  సర్పంచ్ దమ్మా  లతశ్రీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. 

ఎందుకు రాజీనామా..?

గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదని సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు  దమ్మా లతశ్రీ తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం లక్షల్లో అప్పులు చేశామని..కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 7 లక్షల రూపాయల విలువైన బిల్లులు రావాలని లతశ్రీ తెలిపారు. చేసిన అభివృద్ధి పనులకు డబ్బులు ఇప్పించని అధికారులు.. పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని  సర్పంచ్ లతశ్రీ మండిపడ్డారు. 

మొదటగా తన రాజీనామా లెటర్ ను బుగ్గారం ఎంపీడీవోకు ఇద్దామని వెళ్తే.. అక్కడ అధికారులు లేకపోవడంతో జగిత్యాల కలెక్టరేట్ లోని డీపీఓకు అందజేశానని సర్పంచ్ లతశ్రీ తెలిపారు. కేవలం పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని బీఆర్ఎస్ పార్టీకి కాదని సర్పంచ్ తెలిపారు. సర్పంచ్ భర్త దమ్మా లక్ష్మినర్సయ్య బుగ్గారం మండల బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. .