నల్గొండలో బీఆర్ఎస్ ఎత్తులు ఉల్టా..పుల్టా

  •     కేసీఆర్, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తేటతెల్లం
  •     కాంగ్రెస్ కు కలిసొచ్చిన పెరిగిన ఓటింగ్​శాతం
  •     మొత్తంగా కాంగ్రెస్​కు 47.36%, బీఆర్ఎస్​కు 29.30% ఓట్లు
  •     4.22% ఓట్లతో సరిపెట్టుకున్న బీజేపీ

నల్గొండ, వెలుగు:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్​పార్టీ చతికిలబడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్​పై ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉందో ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా తెలిసింది. అభివృద్ధి, సంక్షేమం, బీసీ అస్త్రం ఇలా ఎన్ని రకాల ఎత్తులు వేసినా ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పిన కాంగ్రెస్ కు బ్రహ్మరథం పట్టారు.

కాంగ్రెస్ పార్టీకి 47.36 శాతం ఓట్లు వచ్చాయి. పదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారంతో ఎన్నికల బరిలో దిగిన బీఆర్ఎస్​కు 29.30 శాతం ఓట్లు దక్కాయి. త్రిముఖ పోటీలో సత్తా చూపిస్తామని సవాల్ చేసిన బీజేపీకి కేవలం 4.22 శాతం ఓట్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్​అభ్యర్థులకు 13,73,650 ఓట్లు వస్తే, బీఆర్ఎస్​ అభ్యర్థులకు 8,49,890 ఓట్లు, బీజేపీకి 1,22,556 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్ ​హామీలకు జనం ఆకర్షితులయ్యారని, కేసీఆర్, బీఆర్ఎస్​ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఫలితాల్లో తేటతెల్లం అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014, 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 12 సెగ్మెంట్లలోని ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు.

కలిసిరాని త్రిముఖ పోటీ

త్రిముఖ పోటీ తమకు కలిసి వస్తుందని భావించిన బీఆర్ఎస్​కు చుక్కెదురైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం బీజేపీకి పోతుందని, అంతిమంగా తామే గెలుస్తామని సిట్టింగులు ధీమా వ్యక్తం చేశారు. అనూహ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్​ కాంగ్రెస్ కు ట్రాన్స్​ఫర్​అయింది. ప్రధానంగా నల్గొండ, దేవరకొండ, సూర్యాపేట, ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్ అనుకూలంగా ఉంటదని నమ్మారు.

అయితే బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు​ కూడా దక్కలేదు. పైగా కాంగ్రెస్ అభ్యర్థులకు 50 వేల పైచిలుకు మెజార్టీ రావడంతో బీఆర్ఎస్​ అంచనాలు, ఎత్తులు బెడిసికొట్టాయి. 1999 నాటి ఫలితాలను కాంగ్రెస్ పార్టీ తిరగ రాసింది. అప్పడు 9 చోట్ల కాంగ్రెస్​ గెలిచింది. 24 ఏండ్ల తర్వాత ఆ రికార్డును బ్రేక్​ చేసింది. ఏకంగా 11 స్థానాలను కైవసం చేసుకుంది. 2014లో ఆరు స్థానాలు, 2018లో మూడు స్థానాలతో ఆగిపోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో విజయభేరి మోగించింది. అలాగే తొలిసారి భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్​ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. 

నియోజకవర్గాల వారీగా.. 

నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే కాంగ్రెస్​పార్టీ అత్యధికంగా నకిరేకల్​లో 60.97 శాతం ఓట్లు సాధించింది. కోదాడలో 60.19 శాతం, ఆలేరులో 57.41, భువనగిరిలో 52.4, దేవరకొండలో 52.06, హుజూర్​నగర్​లో 54.21, మిర్యాలగూడలో 59.08, నాగార్జునసాగర్​లో 59.3, నల్గొండలో 52.4, తుంగుర్తిలో 57.53, మునుగోడులో 51.21శాతం ఓట్లు కొల్లగొట్టింది. సూర్యాపేటలో బీఆర్ఎస్​కు 36.36 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్​కు 34.13 శాతం ఓట్లు పోలయ్యాయి.

పెరిగిన ఓటింగ్ ​కాంగ్రెస్​కే..

2018 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో యాదాద్రి జిల్లా మినహా, నల్గొండ, సూర్యాపేటలో పోలింగ్​పర్సంటేజీ స్వల్పంగా తగ్గింది. కానీ, నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే రికార్డు స్థాయిలో పోలింగ్​నమోదైంది. పెరిగిన శాతం కాంగ్రెస్​కు కలిసొచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు 18.06 శాతం అధికంగా ఓట్లు వచ్చాయి.

ఇంత భారీ వ్యత్యాసం గత రెండు దఫాల్లో ఎప్పుడూ కనిపించలేదు. అలాగే బీసీ క్యాండేట్ల సీట్ల కేటాయింపులో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఎమ్మెల్యేల మీదున్న వ్యతిరేకత పోగొట్టేందుకు సీఎం కేసీఆర్​ చివరకు బీసీ అస్త్రాన్ని కూడా వాడారు. కోదాడ, నాగార్జునసాగర్​లో బీసీ చైతన్యం చూపించాలని పిలుపునిచ్చారు. కానీ 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ బీసీ అభ్యర్థుల మీద ప్రజలు చూపించిన ఆదరణ ఈ ఎన్నికల్లో మాయమైంది.

మంత్రి జగదీశ్​రెడ్డికి ఈసారి ప్రభుత్వంలో ఉన్నత స్థానం కల్పిస్తామని స్వయంగా ప్రకటించినా స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. మూడోసారి గెలిస్తే మంత్రి పదవి వస్తదని ఆశించిన గొంగడి సునీత ఆలేరులో ఓటమి పాలయ్యారు.