బీఆర్​ఎస్​లో గ్రూపుల లొల్లి.. ఖానాపూర్, ముధోల్ లో వేడెక్కిన రాజకీయాలు

బీఆర్​ఎస్​లో గ్రూపుల లొల్లి.. ఖానాపూర్, ముధోల్ లో వేడెక్కిన రాజకీయాలు
  •     తమకే టికెట్​ వస్తుందంటూ పార్టీ నేతల పోటాపోటీ ప్రోగ్రాంలు
  •     ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు
  •      ఎమ్మెల్యేలపై అసంతృప్తి వాదుల ఫిర్యాదులు

నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ముధోల్ సెగ్మెంట్లలో అధికార బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటోంది. ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అక్కడి సీనియర్ నేతలతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ పార్టీ అసంతృప్తి లీడర్లే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అసంతృప్తి వాదులంతా ఒకటవుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. రుణమాఫీ సంబురాలను ఎమ్మెల్యేల వర్గంతో పాటు అసంతృప్తి వాదులు వేర్వేరుగా జరుపుకోవడంతో ఆ పార్టీ రాజకీయాల్లో మరింత అగ్గి రాజుకుంది.

తమకే టికెట్ ​వస్తుందంటూ..

ఖానాపూర్ సెగ్మెంట్​లో ఎమ్మెల్యే రేఖా నాయక్, పలువురు సీనియర్ నేతల మధ్య ఏడాది కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ కు సన్నితుడైన జాన్సన్ నాయక్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సన్నిహితుడైన పూర్ణచంద్ర నాయక్ చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం బహిరంగంగా మద్దతు తెలుపుతూ అసమ్మతికి ఆజ్యం పోస్తున్నారు. ఈ సారి టికెట్ ఎమ్మెల్యే రేఖా నాయక్​కు రాదని, తమకే వస్తుందని వారు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడంతో పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని  ఆందోళనకు గురవుతున్నారు.

విఠల్​రెడ్డిపై కేటీఆర్​కు ఫిర్యాదు

ఇక మొన్నటి వరకు ఎలాంటి అలజడి లేని ముధోల్ సెగ్మెంట్​లో  ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. అనేక మంది అసంతృప్తి నేతలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా జట్టుకట్టారు. వీరి వెనక ఐడీసీ చైర్మన్ వేణుగోపాల చారి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కుంటాల మండలానికి చెందిన మాజీ ఎంపీపీ రమణారావు, అలాగే మరికొంతమంది సీనియర్ నేతలు విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ కొద్ది రోజుల క్రితం పార్టీలోని సీనియర్ నేతలు కాంగ్రెస్​లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. వీరంతా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరికొందరైతే విఠల్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. అసంతృప్తివాదులంతా కలిసి హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యేపై మంత్రి కేటీఆర్​, ఇతర కీలక నేతలకు ఫిర్యాదు చేయడం చర్చినీయాంశంగా మారింది. విఠల్​రెడ్డి కారణంగా పార్టీ నష్టపోతోందంటూ వెల్లడించారు. 

చర్చనీయాంశంగా అధిష్టానం వైఖరి

ముధోల్, ఖానాపూర్ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చాలామంది సీనియర్ నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ టికెట్ విషయంలో బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సెగ్మెంట్లలోనే కాకుండా పార్టీలోని కొంతమంది అగ్రనేతలే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంఓ అధిష్టానం పరోక్షంగా అసంతృప్తి వాదులను దువ్వుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అధిష్టానం మద్దతుతోనే ఖానాపూర్ లో ఎమ్మెల్యే రేఖా నాయక్ కు పోటీగా జాన్సన్ నాయక్ బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ టికెట్ విషయంలో పరోక్ష సవాల్ విసురుతున్నట్లు సమాచారం. ముధోల్ సెగ్మెంట్​లో కుంటాల మాజీ ఎంపీపీ రమణారావు కూడా తన సామాజికవ ర్గానికి చెందిన అగ్ర నేతల అండదండలతోనే ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

బర్త్ డేల హంగామా.. 

బీఆర్ఎస్ పార్టీ నేతల బర్త్ డే లు హంగామాగా జరుగుతున్నాయి. బల ప్రదర్శనే లక్ష్యంగా రాజకీయ కోణంలోనే బర్త్ డేలు ఘనంగా జరుపుతున్నారు. ముధోల్ లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బర్త్ డే వేడుకలను ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిర్వహించగా.. ఆ పార్టీ నుంచి రేసులో ఉన్న  భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ నాయక్ పుట్టినరోజు వేడుకలను ఆయన అనుచరులు అట్టహాసంగా నిర్వహించారు. విఠల్ రెడ్డికి ఈసారి టికెట్ నిరాకరిస్తే తన పేరును పరిశీలించాలంటూ రాజేశ్ నాయక్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇప్పటికే ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.