ఆమ్దానీలో బీఆర్ఎస్​ పార్టీ టాప్

ఆమ్దానీలో బీఆర్ఎస్​ పార్టీ టాప్
  • ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్ ప్లేస్ ఆ పార్టీదే
  • 2022–23 ఏడాది లెక్కలు విడుదల చేసిన ఏడీఆర్
  • 39 పార్టీల మొత్తం ఆదాయం రూ.1,740  కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలు 2022-–23 ఆర్థిక సంవత్సరంలో  ఎంత సంపాదించాయి (ఆదాయం), ఎంత ఖర్చు(వ్యయం) చేశాయనే దానిపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంచలన నివేదికను విడుదల చేసింది. 2022-–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 737.67 కోట్లతో దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని గడించిన ప్రాంతీయ పార్టీగా తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) టాప్ లో నిలిచింది. దేశంలోని 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,740.48 కోట్లుకాగా..అందులో బీఆర్ఎస్ పొందిన రూ.737.67 కోట్ల ఆదాయమే 42.38 శాతానికి సమానమని రిపోర్ట్ వెల్లడించింది.

బీఆర్ఎస్ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ.333.45 కోట్లు (19.16 శాతం), డీఎంకే రూ.214.35 కోట్లు (12.32 శాతం) ఉన్నాయి. 39 పార్టీల మొత్తం ఆదాయం (రూ.1,740.48 కోట్లు)లో  కేవలం టాప్-5 స్థానాల్లో నిలిచిన పార్టీల ఆదాయమే రూ.1,541.32 కోట్లుగా ఉందని రిపోర్ట్ వివరించింది. ఇది ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 88.56 శాతానికి సమానమని తెలిపింది. దేశంలో మొత్తం 57 ప్రాంతీయ పార్టీలు ఉండగా.. అందులో 39 పార్టీలు తమ ఆదాయ, వ్యయ విషయాలను ఈసీకి సమర్పించాయి. దాని ఆధారంగా ఏడీఆర్ నివేదికను తయారు చేసి రిలీజ్ చేసింది. 

ఖర్చుల్లో టీఎంసీ టాప్

2022–23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఖర్చు చేసిన పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ నిలిచింది. ఆ ఏడాది టీఎంసీ రూ.181.18 కోట్లు ఖర్చు చేసింది. ఇది దేశంలోని ప్రాంతీయ పార్టీల మొత్తం ఖర్చులో 37.66 శాతానికి సమానం. రెండో స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ రూ.79.32 కోట్లు (16.49 శాతం), మూడో స్థానంలో బీఆర్ఎస్ రూ.57.47 కోట్లు (11.94 శాతం), నాలుగో స్థానంలో డీఎంకే రూ.52.62 కోట్లు(10.94 శాతం), ఐదో స్థానంలో సమాజ్ వాదీ పార్టీ రూ.31.41 కోట్లు (6.53 శాతం) నిలిచాయి. ప్రాంతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ. 1,522.46 కోట్ల ఆదాయంలో.. రూ.1,285.83 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లభించాయి. ఎనిమిది ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలను స్వీకరించాయని ఏడీఆర్ స్పష్టం చేసింది. 

మిగులులోనూ బీఆర్ఎస్సే..

2022-–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 19 ప్రాంతీయ పార్టీలు తమ ఖర్చులుపోనూ ఆదాయం మిగిలిందని ఈసీకి తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీకి ఖర్చులుపోనూ అత్యధికంగా రూ.680.20 కోట్ల ఆదాయం మిగిలింది. బీజూ జనతాదళ్ కు రూ.171.06 కోట్లు, డీఎంకేకు రూ.161.72 కోట్ల మేర ఇన్ కం మిగిలింది. 20 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయని తెలిపాయి. కర్నాటకకు చెందిన జేడీఎస్ పార్టీ తమ ఆదాయం కంటే ఖర్చులే 490.43 శాతం ఎక్కువ జరిగాయని ఏడీఆర్ వెల్లడించింది.

గడువులోగా వివరాలిచ్చినవి 16 పార్టీలే 

ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను 2023 అక్టోబర్ 31లోగా సమర్పించాలని  ఈసీ గడువు విధించింది. కానీ 16 పార్టీలు మాత్రమే గడువులోగా వివరాలు ఇచ్చాయి.  మిగిలిన 23 పార్టీలు తమ నివేదికలను 3 నుంచి 150 రోజులు లేటుగా సమర్పించాయని ఏడీ ఆర్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈసీకి ఏడీఆర్ పలు సూచనలు చేసింది. ఆడిట్ నివేదికలను ఆలస్యంగా  సమర్పించే పార్టీలకు జరిమానా విధించాలని సిఫార్సు చేసింది. రాజకీయ నిధుల్లో పారదర్శకత ఉండేలా సమాచార హక్కు చట్టం కింద దాతల వివరాలను వెల్లడించాలని చెప్పింది. ఐటీ యాక్ట్​లోని సెక్షన్ 13 ఏ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29 (సీ ) వంటి చట్టాలను కఠినంగా అమలు చేయాలని పేర్కొంది.