
తెలంగాణలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుందని... బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తొందర్లోనే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసిందని.. ఎన్నికల అనంతరం రైతుల రుణమాఫీ కూడా పూర్తి చేస్తుందన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో సుమారు 200 మంది నాయకులు చేరారు. వారందరికీ కండువా కప్పి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. చెన్నూర్ లో రూ.14 కోట్ల నిధులతో తాగు నీరు కోసం ట్యాంక్ లు కట్టించడం జరిగిందన్నారు. గత పాలకులు సాకులు చెప్పి అభివృద్ధి చేయలేదని.. తాను కొటపల్లి మండలంను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణను వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.