- పెద్దపల్లి జిల్లాలో మున్సిపాలిటీలకు అవిశ్వాస గండం
- నేడు సుల్తానాబాద్‌లో అవిశ్వాసంపై స్పెషల్ మీటింగ్
- ఈనెల 16న మంథనిలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం
- పెద్దపల్లి, రామగుండం బల్దియాల్లోనూ క్యాంపుల టెన్షన్
పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో అవిశ్వాస నోటీసులతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అధికారం కోల్పోయాక ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు పెరిగాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌లోకి లీడర్లు క్యూ కడుతున్నారు. దీనిలో భాగంగా నెల రోజులుగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసాలకు సిద్ధమయ్యారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు చేంజ్అయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
సుల్తానాబాద్ మున్సిపాలిటీతో మొదలు
కొన్ని రోజుల కింద సుల్తానాబాద్ మున్సిపాలిటీలో అవిశ్వాస ప్రయత్నం మొదలుకాగా తాజాగా చివరి దశకు చేరుకుంది. గత నెల 6 న కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ముత్యం సునీతపై అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్‌కు నోటీసు ఇచ్చారు. కలెక్టర్ ఈనెల 3న అవిశ్వాసం కోసం మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే మంథని మున్సిపాలిటీలో రెండు రోజుల కింద ముసలం పుట్టింది. ఈ మున్సిపాలిటీలో 13 మంది కౌన్సిలర్లు ఉండగా, బీఆర్ఎస్‌కు 11 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు ఉన్నారు. ఇటీవల ఏడుగురు కౌన్సిలర్లు హైదరాబాద్ వెళ్లి మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఆ తర్వాత వెంటనే జిల్లాకేంద్రానికి చేరుకొని అడిషనల్ కలెక్టర్‌ను కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ, వైస్‌చైర్మన్ ఆరెపల్లి కుమార్‌పై అవిశ్వాస నోటీసు అందించారు. దీంతో అడిషనల్ కలెక్టర్ ఫిబ్రవరి 16న అవిశ్వాసంపై చర్చకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో రాజకీయ రచ్చ పెరిగిపోయింది.
మున్సిపాలిటీలు ‘చే’జిక్కితున్నయ్
ప్రస్తుతం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు హస్తం పార్టీ కైవసం చేసుకునేలా కన్పిస్తోంది. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లే మెజార్టీగా ఉన్నప్పటికీ అవిశ్వాసాలు తెరమీదకు వచ్చాయి. పెద్దపల్లి మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్‌కు చెందినవారే అయినప్పటికీ కొన్ని రోజులుగా అవిశ్వాసంపై చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గంపగుత్తగా మూడొంతుల కౌన్సిలర్లు అనధికారికంగా కాంగ్రెస్‌లో చేరిపోయారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సీటుకు డిమాండ్ పెరిగిపోయింది. పోటీ పెరగడంతో అవిశ్వాస నోటీసులు లేటవుతున్నట్లు పలువురు కౌన్సిలర్లు చెప్తున్నారు. రామగుండం మున్సిపల్కార్పొరేషన్పరిస్థితి కూడా అలాగే ఉంది. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుత మేయర్పట్ల అసంతృప్తితో ఉన్నప్పటికీ, చాలామంది ఆ పదవిని ఆశిస్తుండడంతో అవిశ్వాసం ప్రకటించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల పాలకవర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
నేడే సుల్తానాబాద్‌లో ‘అవిశ్వాస’ మీటింగ్
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ ముత్యం సునీత(బీఆర్ఎస్)పై పెట్టిన అవిశ్వాస నోటీస్‌పై శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక మున్సిపల్ ఆఫీసులో నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే అధికారులు కౌన్సిలర్లకు నోటీసులు పంపించారు. 15 మంది కౌన్సిలర్లలో ఒకరు చనిపోగా.. కౌన్సిలర్ గాజుల లక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు మొత్తం11 మంది చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస నోటీసు అందజేశారు. అనంతరం క్యాంపుకు వెళ్లారు.
ప్రస్తుతం చైర్‌పర్సన్ వ్యతిరేక శిబిరంలో 13 మంది చేరినట్లు తెలుస్తోంది. దీంతో చైర్‌పర్సన్ ఒక్కరే మిగిలిపోయారు. ఈ పరిస్థితుల్లో నెగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. అనంతరం కొత్త చైర్ పర్సన్ ఎన్నికకు నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. అవిశ్వాస ప్రత్యేక సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు.