ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు (అక్టోబర్ 14) బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కూకట్ పల్లి కేపి.హెచ్.బి ఇందు ఫార్చ్యూన్ ఫిల్డ్స్ లోని రాజేంద్రప్రసాద్ నివాసంలో ఆయనని పరామర్శించారు.
ఇందులోభాగంగా గాయత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే చిన్న వయసులోనే గాయత్రి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్న రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొనడంతో తమను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ కుటుంబంతో కేసీఆర్ కి కూడా ఎనలేని బంధం ఉందని దీనిలో భాగంగానే నేడు నివాళులు అర్పించడం జరిగిందన్నారు.