గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్‎వి గురివిందగింజ నీతులు..!

గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్‎వి గురివిందగింజ నీతులు..!

రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూములపై ఐఎంబీ సంస్థకు వ్యతిరేకంగా వాదనలు వినిపించి 400 ఎకరాలను ప్రజా ప్రభుత్వం తిరిగి దక్కించుకుంది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు సాఫ్ట్​వేర్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగెత్తించాలని కంచె గచ్చిబౌలి భూములను అభివృద్ధి చెయ్యాలని భావించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ రాద్ధాంతం చేయడం అత్యంత దారుణం. వాస్తవాలను  కప్పిపుచ్చి రాజకీయ లబ్ది కోసం బీజేపీ, బీఆర్ఎ‎లు ఆడుతున్న రాజకీయ కుట్రలు రాష్ట్రానికి మేలు చేయకపోగా తెలంగాణ  పరువును మంట కలపాలని చూడటం వారి దుర్బుద్ధికి నిదర్శనం. 


కంచె గచ్చిబౌలి భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవి కావు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిని  2004 జనవరి 13న అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం రాష్ట్ర క్రీడావసతుల అభివృద్ధికి ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‎ను మెమో నెంబర్ 39612/ASSN/V(2) 2003 ప్రకారం కేటాయించింది. ఐఎంజీ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో  నెంబర్ 111080/S1/2003 ప్రకారం ఆ కేటాయింపును రద్దుచేసి ఏపీ యూత్ అడ్వాన్స్​మెంట్​టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్​మెంట్‎కు  కేటాయించింది. 

ఐఎంజీ సంస్థ 2006 రిట్ పిటిషన్ 24781/2006  హైకోర్టులో సవాల్ చేసింది. రెండు దశాబ్దాల న్యాయపోరాటానికి ముగింపు పలకాలని రేవంత్ సర్కార్ చేసిన కృషి ఫలితంగా 2024 మార్చి 7న హైకోర్టు తీర్పు తెలంగాణ సర్కార్‎కు అనుకూలంగా వచ్చింది. తిరిగి ఐఎంజీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సవాల్ చేసింది. ఈ పిటిషన్​కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఫలితంగా 2024 మే 3న ఐఎంజీ పిటిషన్​ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి తెలంగాణకు దక్కింది. 

 గురివిందగింజ నీతులు

గడిచిన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్​పాలకులు తెలంగాణలోని ప్రభుత్వ భూములను తమ బంధువర్గానికి కట్టబెట్టారు. ధరణి పేరుతో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను దోచుకుతిన్నవారు నేడు శ్రీరంగనీతులు వల్లిస్తున్నారు. అనతికాలంలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1200 కోట్లు, 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు, సొంత విమానం. ఇవన్నీ అప్పనంగా తెలంగాణ సంపదను దోచిపెట్టి తద్వారా ఒనగూరిన ప్రయోజనంగాక మరి ఏమిటి..? 2018లో సర్వేనెంబర్ 25లో మై హోమ్ రామేశ్వరరావుకు 50 ఎకరాలు కట్టబెట్టి 100 ఫీట్ల రోడ్డు వేసి ఆకాశహర్మ్యాలు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి అమ్ముకోవడానికి ఓసి ఇచ్చిన కేటీఆర్ నేడు పర్యావరణం ఎకో పార్కు అంటూ గురివిందగింజ నీతులు చెప్పడం విడ్డూరం.

ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల అమ్మకంతోనే అభివృద్ధి అని ఎకరం వంద కోట్లు అంటే తెలంగాణ పరపతికి దర్పణం అని ఆనాడు కోకాపేట భూములు వేలం సందర్భంగా అన్న సంగతి వారికి గుర్తు లేదా..? 196 ఎకరాల భూమిని పుట్నాలు, బెల్లాలకు పంచిపెట్టి బీఆర్ఎస్ నేడు కంచె గచ్చిబౌలి భూములను హెచ్​సీయూ  భూములంటూ గగ్గోలు పెట్టడం చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అన్నట్లుంది బీఆర్ఎస్ తీరు. 

ఆందోళన వెనుక బీఆర్ఎస్, బీజేపీ

నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయనే వాస్తవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుతిన్నది ఫ్యూడల్ ప్రభువు  కేసీఆర్ కుటుంబం. రియల్ ఎస్టేట్ మాఫియా దోపిడీని అడ్డుకోవాలనే ఆశయంతో ఉన్న రేవంత్ సర్కార్ యువతకు ఉపాధి దిశగా అడుగులేస్తున్న తరుణంలో సహకరించాల్సిన ప్రతిపక్షాలు పిల్లి శకునాలు పెడుతున్నాయి. తెలంగాణ  రాష్ట్రంలో  దోచుకుతిన్న లక్షల కోట్లతో బీఆర్ఎస్ అడ్డగోలుగా ప్రచారం చేయడం, చేయించడం వెనుక తెలంగాణ ప్రగతిని దెబ్బతీయటమే లక్ష్యంగా కనిపిస్తోంది.

అభివృద్ధి పనులకు భూమి స్వాధీనం

టీజీఐఐసీ విజ్ఞప్తి మేరకు శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల పోరంబోకు (సర్కారీ భూమి) అని నిర్ధారించారు. ఆక్రమణలకు గురికాకుండా, అభివృద్ధి పనులకుగాను ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని వారు సూచించారు. కంచె  గచ్చిబౌలిలోని 400 ఎకరాల  ప్రభుత్వ భూమిని కొలిచి హక్కులు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం I అండ్ C విభాగం 2024 జూన్ 19న సూచించింది. టీజీఐఐసీకి బదలాయిస్తూ  2024  జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆర్డీవో అండ్ ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించి 2024 జులై 1న టీజీఐఐసీకి 400 ఎకరాలు అప్పగించారు. టీజీఐఐసీ సైబరాబాద్ జోనల్  మేనేజర్ హెచ్​సీయూ రిజిస్ట్రార్‎కు  2024 జులై 4న లేఖ రాయడంతో టీజీఐఐసీ అధికారులు హెచ్​సీయూ రిజిస్ట్రార్​వ్యక్తిగతంగా కలిసి తమ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఆయనకు వివరించారు. యూనివర్సిటీ సమ్మతితో 2024 జులై 19న యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్​స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే అనంతరం హద్దులు నిర్ధారించారు.


- కైలాశ్​ నేత,
జనరల్​ సెక్రటరీ, టీపీపీసీ