పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్.. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ను కలిశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు వెంకటేష్ నేత. పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫస్ట్ టైం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి ఎంపీ ఇవాళ కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కు షాక్ అనే చెప్పవచ్చు.
ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. పార్టీ మారట్లేదని వారు వివరణ ఇచ్చారు.
Also Read : ప్రజావాణి’ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులోకి పాతిపెడతామని ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే.