- ఏ పార్టీలో చేరేది లేదంటున్న లోకనాథ్ రెడ్డి
- అక్రమ కేసులకు భయపడేనా?
- అవిశ్వాసానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ లీడర్లు
వనపర్తి, వెలుగు నిధులు, పాలన విషయంలో మంత్రి నిరంజన్ రెడ్డి అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని, ఆఫీసర్లు తమ మాట వినడం లేదని ఆరోపిస్తూ వనపర్తి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మరో ఇద్దరు ఎంపీపీలు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.నియోజకవర్గంలోని పలువురు సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. వీరంతా మరో పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపారు. అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అసంతృప్త నేతలోకనాథ్ రెడ్డి, ఇద్దరు ఎంపీపీలతో చర్చలు జరిపారు. ఆత్మగౌరవం దెబ్బ తినేలా బీఆర్ఎస్ వ్యవహర్తిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్త నేతలతో కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెప్పడంతో అందరూ పొంగులేటి గ్రూప్ లో చేరిపోయారు. అయితే లోక్‌నాథ్‌రెడ్డి మాత్రం అంటీముట్టనట్టుగా ఉంటున్నారనే ప్రచారం నెలకొంది.
లోకనాథ్ రెడ్డికి ఏమైంది?
వనపర్తిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇద్దరు ఎంపీపీలు ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ సభకు లోక్‌నాథ్‌రెడ్డి గైర్హాజరయ్యారు. తాను ఎవ్వరితోనూ ఉండనని తేల్చి చెప్పేశారు. కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాకు తాను మొదటి జడ్పీ చైర్మన్ గా అవకాశం వచ్చిందని, దానిని వదులుకోనని చెబుతున్నారు. తాను పూర్తి కాలం పని చేస్తానని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో మాత్రం తిరిగి చేరనని అంటున్నారు. దీంతో జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రితో విభేదించిన జడ్పీ చైర్మన్, ఎంపీపీలు ముందుగా బీజేపీలో చేరాలని నిర్ణయించి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఏ పార్టీలో చేరాలన్న అంశాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులకు వదిలేశారు. లోక్ నాథ్ రెడ్డి బీజేపీలో చేరాలని భావిస్తుండగా, ఇద్దరు ఎంపీపీలు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుండడంతో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పొంగులేటి, జూపల్లి పాల్గొన్న సభకు హాజరు కాలేదని అంటున్నారు.
అవిశ్వాస తీర్మానానికి ప్లాన్..
జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డిని పదవి నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. జూన్ నాటికి పాలకమండలికి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఆ తరువాత ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి తప్పించాలని కొందరు జడ్పీటీసీలు ఇప్పటికే పట్టుబట్టారు. మంత్రిపై నిందలు వేయడంతో పాటు పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే తాము పార్టీలో ఉండమని కొందరు జడ్పీటీసీలు హెచ్చరించారు.
సర్వేల జోరు..
మంత్రి నిరంజన్ రెడ్డి సొంత నియోజకవర్గం వనపర్తిలో పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎవరు గట్టి పోటీ ఇస్తారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్న వారి పేర్లను ఓటర్ల వద్ద ప్రస్తావించడం అయోమయానికి గురి చేస్తోంది.
కేసులకు భయపడా?
బీఆర్ఎస్ ను వీడిన నాయకులపై మంత్రి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డిపై ఓ కాంట్రాక్ట్ పని విషయంలో పేమెంట్ చేయకుండా మోసం చేశాడని చీటింగ్ కేసు నమోదైంది. విషయం తెలుసుకున్న మేఘారెడ్డి హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడని అంటున్నారు. వ్యవసాయ మార్కెట్లో కమీషన్ ఏజెంట్ అయిన లోక్ నాథ్ వివిధ రాష్ట్రాల్లో వేరుశనగ వ్యాపారిగా గుర్తింపు పొందారు. తన వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతో పాటు అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవడం ఎందుకని మౌనం వహించారని చెబుతున్నారు.