తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిరపర్చడమెలా? అని కేసీఆర్ మేధోమథనం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. తనకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ ను సీఎం పదవి నుంచి తప్పించడమెలా? అని బీఆర్ఎస్ చీఫ్ పలు వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలియవచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయిందని, సీనియర్ మంత్రులకు, సీఎంకు మధ్య పొసగడం లేదంటూ ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ ఉధృతం చేసింది. పరిపాలనలో రేవంత్ విఫలమయ్యారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ క్యాడర్ ను కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లోనూ కొందరు లీడర్లు రేవంత్ పై అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నట్టు కూడా మరో ప్రచారానికి కూడా తెరలేపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రతిష్టల మీద దాడి చెయ్యడమే ఎజండాగా బీఆర్ఎస్ నాయకత్వం పని చేస్తున్నది.
ఈ మేరకు ఎర్రవల్లి కోటలో కార్యాచరణ ప్రణాళికను కేసీఆర్ రూపొందిస్తున్నారు. తాము అధికారం కోల్పోవడం కన్నా రేవంత్ సీఎం కావడమే బీఆర్ఎస్ ను ఎక్కువగా కలచివేస్తున్నది. అందుకే కాంగ్రెస్ సర్కారులో కీలకమైన సీనియర్ మంత్రులకు, సీఎంకు మధ్య ‘కృత్రిమ’ విభేదాలు సృష్టించేందుకు గులాబీ దళం పూనుకున్నది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి పరిపాలనా నిర్ణయాలలో సీనియర్ మంత్రులకు భాగస్వామ్యం లేదన్న ప్రచారాన్ని ప్రధాన ప్రతిపక్షం తన మీడియాలో హోరెత్తిస్తున్నది. కానీ, రుణమాఫీ అయినా, హైడ్రా ఏర్పాటు అయినా మంత్రులతో చర్చించి, హైకమాండ్ అనుమతి పొందాకే రేవంత్ నిర్ణయాలు తీసుకున్నారు. కమిషన్లకు చైర్మన్ల నియామకాల్లోనూ పార్టీలో విమర్శలేమీ లేవు. పైగా పార్టీకి తగిన సేవలు అందించిన వారికి, అర్హులైన నిపుణులు, మేధావులకే ఆయా కమిషన్లలో ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే పీసీసీ చీఫ్ గా బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్ ను పార్టీ హైకమాండ్ ఎంపిక చేయడంలోనూ రేవంత్ ప్రభావం ఉన్నది.
ఆది నుంచే శాపనార్థాలు
రేవంత్ సీఎం అయినప్పటి నుంచే కేసీఆర్ తీరు కూడా అలాగే కన్పిస్తున్నది. మొదట్లోనే ప్రజలు మోసపోయారని నిందించారు. ‘‘తెలంగాణ ఖజానా ఖాళీ అని ఎన్నడైనా అన్ననా? సీఎం అంటే నాలా వ్యూహాత్మకంగా ఉండాలి. నన్ను గెలిపించి ఉంటే దేశంలో అగ్గిపెట్టేవాడిని. అయినా ఇప్పుడు చిన్న దెబ్బే తగిలింది. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తది. మూడు నాలుగు నెలలు పని చేయనివ్వండి. వాళ్ల వ్యవహారం ఏందో చూద్దాం” అని కేసీఆర్ కామెంట్లు చేశారు. తెలంగాణ సంపన్న రాష్ట్రం అని కేసీఆర్ పదే పదే చెప్పేవారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అని రేవంత్ గుర్తించారు. అందుకే ‘లంకెబిందెలు ఉంటాయని వస్తే..’ అని కాకతాళీయంగా మాట్లాడారు. అయినా సరే.. ఇప్పటికీ కాంగ్రెస్ హామీలకు మోసపోయి ప్రజలు ఆ పార్టీని గెలిపించారంటూ అవహేళన చేయడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారింది. ‘‘ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం”అని ఆ పార్టీ క్యాడర్ కు నేతలు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజలు తమను తిరస్కరించడానికి కారణాలను అన్వేషించడంలో కేసీఆర్ అండ్ కోకు చిత్తశుద్ధి కరువైందనేది తేలిపోతున్నది.
అందరినీ ఏకతాటిపైకి తెచ్చి..
రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాడే రాష్ట్రంలో పార్టీని గెలిపిస్తే సీఎం పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిన సంగతి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కేసీఆర్ కు కూడా తెలుసు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి నాలుగేళ్ళు కాకముందే పార్టీ పగ్గాలు రేవంత్ చేతికి వచ్చాయి. పార్టీలోని సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులను కాదని రేవంత్‌ను పీసీసీ చీఫ్ గా నియమించినప్పుడు పార్టీలో వ్యతిరేక స్వరాలు వినిపించాయి. కానీ కేసీఆర్ ను మట్టి కరిపించగలిగిన సామర్థ్యం, నిధుల సమీకరణలో చాకచక్యం, అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను ఆకట్టుకున్నవి. కేసీఆర్‌ను ఢీకొట్టడానికి కాంగ్రెస్ కు ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డే కరెక్ట్ అని హైకమాండ్ గుర్తించింది. హైకమాండ్ అంచనాల మేరకు రేవంత్ కూడా అందరినీ కలుపుకొనిపోయి పార్టీని అధికారంలోకి తెచ్చారు. వీహెచ్ లాంటి సీనియర్లు, భట్టి, ఉత్తమ్, శ్రీ ధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ వంటి కాంగ్రెస్ ఉద్దండులను రేవంత్ సమన్వయం చేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారి మద్దతు పొందగలిగారు. పొన్నం ప్రభాకర్ వంటి తెలంగాణవాదులకు సరైన ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి వంటి పొటెన్షియల్ నాయకుల మద్దతునూ కూడగట్టుకోగలిగారు. ఇలా కీలక నేతలందరికీ సరైన ప్రాధాన్యం ఇస్తూ అందరినీ ఒక్కతాటిపైకి తేగలిగారు రేవంత్. అందుకే రేవంత్ ను వ్యతిరేకించిన నేతలు సైతం డిసెంబర్ 3న ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనకు అనుకూలంగా మారిపోయారు.
Also Read : కాళోజీ అంటేనే తెలంగాణ భాష
కేసీఆర్ కు ప్రత్యామ్నాయ నేతగా..
2015లో ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలు నుంచి నెల రోజుల తరువాత బయటికి వచ్చినప్పుడు.. ‘‘కేసీఆర్‌ను ఓడించడమే నా ఏకైక అజెండా’’ అని రేవంత్ రెడ్డి శపథం చేశారు.“నేను కేసీఆర్‌ను ప్రత్యర్థిగా ఎంచుకోలేదు. ఆయనే నన్ను తన ప్రత్యర్థిని చేసుకున్నారు” అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ ఆశయ సాధన కోసం ఎన్నికల ఏడాదిలో పార్టీలోని సీనియర్లను కలుపుకొనిపోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. కప్పల తక్కెడ అనే విమర్శకు తావు ఇవ్వకుండా అంతర్గత విభేదాలు బయటకు రాకుండా చూడగలిగారు. రాహుల్ గాంధీ 'భారత్ జోడో' యాత్ర తెలంగాణలో12 రోజులు సాగింది. ప్రధానంగా గ్రామీణ ఓటర్లపై ఆ యాత్ర సానుకూల ప్రభావం చూపింది. తెలంగాణలో రాహుల్‌తో పాటు పర్యటించిన రేవంత్ రెడ్డి స్థానికంగా తన బలాన్ని చాటుకోవడానికి ఆ అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నారు. “బీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలు. ఆ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయి” అనే రేవంత్ ప్రచార వ్యూహం కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు మంచి కిక్కు ఇచ్చింది. కేసీఆర్ వంటి నాయకుడిని కూడా మనం గద్దె దింపేయొచ్చని ప్రజలు నిర్ధారణకు వచ్చారు.
పార్టీ పేరు మార్పుతో మారిన జాతకం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2014లో కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన టీడీపీని నిర్మూలించడంలో విజయం సాధించారు. అయితే చాలామంది టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరగా మిగిలిన ‘ఒకే ఒక్కడు’గా నిలిచారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను కూడా అంతం చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేసినా ఫలించలేదు. రేవంత్ కాంగ్రెస్ లో చేరి, పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. మరోవైపు జాతీయ రాజకీయాల పేరుతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా కేసీఆర్ మార్చడం ఆత్మహత్యాసదృశ్యంగా మారింది. దీని ప్రభావం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో స్పష్టంగా రుజువైంది. “పేరు మార్పుతో ఆ పార్టీ తెలంగాణ బొడ్డు పేగును తెంచుకుంది” అని ఒక జర్నలిస్టు అప్పట్లో వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజానికి యాంటీ- ఫ్యూడల్ ఉద్యమాల చరిత్ర ఉందన్న విషయాన్ని కేసీఆర్ మరచిపోయారు. అందువల్లనే ఆయన పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు.
కేసీఆర్ కే ఎక్కువ బాధ
రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించి ఆ స్థానంలోకి కాంగ్రెస్ లో తమకు అనుకూలమైన నేతల్లో ఎవరో ఒకరు రావాలన్నది బీఆర్ఎస్ ఆశ. కానీ, 2029లోపు అలాంటి పరిణామాలు జరిగే అవకాశాలేమీ లేవు. రేవంత్ రెడ్డి సారథ్యంలోనే 2029 అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగితే ఆయన ఎత్తుగడలకు చిత్తవుతామన్న భయం బీఆర్ఎస్ ను వెంటాడుతోంది. కేసీఆర్ కన్నా రేవంత్ రెండాకులు ఎక్కువే చదివారన్నది బీఆర్ఎస్ కు ఇప్పటికే అర్థమైపోయింది. 2023 ఎన్నికల్లో రేవంత్ వ్యూహాత్మకంగా దెబ్బకొట్టి ఉండకపోతే కేసీఆర్ హ్యాట్రిక్ ను అడ్డుకోవడం కాంగ్రెస్ కు సాధ్యమయ్యేది కాదు. అయితే, కాంగ్రెస్ లో తమకు సీఎం పదవి రానందుకు కీలక నేతల్లో అసంతృప్తి ఉండటం సహజమే. కానీ వాళ్ల కన్నా.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎక్కువగా ఆవేదన చెందుతున్నారని ఆ పార్టీ క్యాడర్ లోనే టాక్ నడుస్తున్నది. అందుకే రేవంత్ ను ఎలాగైనా సీఎం పోస్టు నుంచి తప్పించే లక్ష్యంతో బీఆర్ఎస్ చీఫ్ పావులు కదుపుతున్నారని తెలుస్తున్నది.
సీఎంల మార్పుపై మారిన కాంగ్రెస్ తీరు
కాంగ్రెస్ పార్టీ గతంలో కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను వెంటవెంటనే మార్చడంతో ప్రతికూల ఫలితాలను అనుభవించింది. అందుకే దాదాపు 2004 నుంచి ముఖ్యమంత్రుల మార్పు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆచి తూచి వ్యవహరిస్తున్నది. దాదాపు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల ను తరచూ మార్చిన చరిత్ర ఏమీ లేదు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ పై తీవ్ర అసమ్మతి చెలరేగినా ఆయనను మార్చలేదు. అలాగే మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లోనూ మార్చలేదు. ప్రస్తుతం కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పటిష్టంగానే ఉన్నాయి. పొరుగున ఉన్న కర్నాటకలో సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను మార్చే అవకాశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. కానీ సీఎంను మార్చేందుకు పార్టీ హైకమాండ్ సుముఖంగా లేదని టెన్ జన్ పథ్ నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.
- ఎస్.కె. జకీర్, సీనియర్ జర్నలిస్ట్